వైసీపీ సర్కార్‌లో వైఎస్సార్ ఆనవాళ్లే లేవు: షర్మిల
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 25 Jan 2024 9:41 AM GMTవైసీపీ సర్కార్‌లో వైఎస్సార్ ఆనవాళ్లే లేవు: షర్మిల
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న వైఎస్ షర్మిల రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే కాదు.. ప్రస్తుతం, గత ప్రభుత్వాల తప్పిదాలను ఎత్తిచూపుతున్నారు. ఈ క్రమంలోనే అన్న జగన్‌పై కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మరోసారి వైఎస్ షర్మిల జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రస్తుత వైసీపీ సర్కార్‌లో వైఎస్సార్ ఆనవాళ్లే కనిపించడం లేదని అన్నారు. సంక్షేమ పథకాలను సీఎం జగన్ తూట్లు పొడిచారని షర్మిల కామెంట్ చేశారు.
రాజశేఖర్‌రెడ్డి పాలనకు.. జగన్ పాలనకు పొంతనే లేదని వైఎస్ షర్మిల అన్నారు. నానన పేరును జగన్ పూర్తిగా చెడగొట్టారని ఫైర్ అయ్యారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేయడం తప్పం.. అభివృద్ధి చేసింది ఏమీ లేదన్నారు. జగన్ వ్యక్తిగతంగా తనకు నష్టం చేశారని అన్నారు. అయితే.. ప్రజలకు అయినా మేలు చేస్తారని భావించాననీ.. కానీ అది కూడా జరగలేదని జగన్‌పై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కల అనీ.. అది ఇప్పటికీ పూర్తి చేయలేకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. 1941లోనే దాన్ని నిర్మించాలని అనుకున్నా.. ఏ నాయకుడు ఆ సాహసం చేయలేదని షర్మిల అన్నారు. కానీ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యాక 6 నెలల్లోనే పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని షర్మిల గుర్తు చేశారు.
పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ ఐదేళ్లలో ఏం చేశారనీ ప్రశ్నించారు. ప్రజలు అడిగే ఏం చెబుతారంటూ నిలదీశారు. 2021లో పోలవరం పూర్తి చేస్తామని ఏవేవో మాటలు చెప్పారనీ.. కానీ ఇప్పుడు కనీసం పోలవరం ఊసే ఎత్తడం లేదన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో వ్యవసాయం పండగలా ఉండేదనీ.. ఇప్పుడు దండగ అయిపోయిందని ఆవేదన చెందారు.
సీఎం జగన్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్ షర్మల ఆరోపించారు. కనీసం వారి పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఆయన ముఖం చూపించట్లేదన్నారు. ఎంతోమంది కష్టపడి.. త్యాగాలు చేస్తేనే జగన్ సీఎం అయ్యారనీ చెప్పారు. కానీ.. ఇప్పుడు పక్కన ఉన్నవారందరనీ పక్కన పెడుతూ.. దూరం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. జగన్ కోసం రాజీనామా చేసిన 18 మందిలో ఎంత మందిని మంత్రులను చేశారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. వైఎస్ ప్రభుత్వానికి.. జగన్ ప్రభుత్వానికి నక్కకు.. నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.