ప్రధాని మోదీని విమర్శించే అర్హత మంత్రి బొత్సకు లేదు: పురందేశ్వరి

మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కౌంటర్ ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on  9 May 2024 5:56 AM GMT
andhra pradesh, bjp, purandeswari,  minister botsa,

ప్రధాని మోదీని విమర్శించే అర్హత మంత్రి బొత్సకు లేదు: పురందేశ్వరి

ప్రధాని నరేంద్ర మోదీ తన పదవికి విలువ లేకుండా చేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్‌ వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కౌంటర్ ఇచ్చారు. మంత్రి బొత్స చేసిన కామెంట్స్‌పై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కామెంట్స్‌ను ఖండిస్తున్నట్లు పురందేశ్వరి పేర్కొన్నారు. పచ్చకామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగానే కనబడుతుందంటూ పురందేశ్వరి విమర్శించారు. అవినీతిపరులకు లోకమంతా అవినీతిమయంగానే కనిపిస్తుందనీ.. మీరు చేసిన ఫోక్స్‌ వ్యాగన్‌ స్కామ్‌ను ప్రజలు ఇంకా ఏమీ మర్చిపోలేదంటూ పురందేశ్వరి కౌంటర్ ఇచ్చారు.

దేశంలో అతిపెద్ద అవినీతి పార్టీ బీజేపీనే అంటూ మంత్రి బొత్స మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు పురందేశ్వరి. విశాఖకు కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ను ఇస్తే... రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకోలేకపోయిందని విమర్శించారు. పసలేని ఆరోపణలు చేయొద్దని బొత్సకు హితవు పలికారు. ఇక రాబోయే ఎన్నికల్లో బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి రాబోతుందని ఆమె అన్నారు. ఈసారి కాంగ్రెస్‌ పార్టీ మరిన్ని తక్కువ సీట్లకే పరిమితం కానుందని చెప్పారు. బీజేపీ పదేళ్ల పాలనలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని చెప్పారు. అలాగే ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. ప్రజలంతా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారనీ.. మోదీ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి అన్నారు.

అంతకుముందు బీజేపీ, ప్రధాని మోదీ గురించి మాట్లాడిన మంత్రి బొత్స.. ఏపీలో తోడుదొంగలు ఇచ్చిన స్క్రిప్ట్‌ను మోదీ చదివారని చెప్పారు. నిజాలు పరిశీలించకుండా ఏది ఇస్తే అదే చదివేస్తారా అంటూ నిలదీశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ గురించి ఎందుకు ప్రధాని మాట్లాడలేదని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.


Next Story