తెలంగాణలో 12కి పైగా లోక్‌సభ స్థానాలను గెలవాలి: అమిత్‌షా

మూడోసారి నరేంద్ర మోదీ సర్కార్‌ రాబోతుందని అమిత్‌షా దీమా వ్యక్తం చేశారు.

By Srikanth Gundamalla  Published on  12 March 2024 4:00 PM IST
amit shah, bjp, telangana tour,  lok sabha elections ,

తెలంగాణలో 12కి పైగా లోక్‌సభ స్థానాలను గెలవాలి: అమిత్‌షా

కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే భాగ్యలక్ష్మి అమ్మవారికి, భద్రాద్రి రాముడికి నమస్కారాలు తెలిపారు. బీజేపీ సోషల్‌ మీడియా వారియర్స్‌ సమావేశంలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయని ఆయన అన్నారు. ప్రతి ఇళ్లు తిరిగి ప్రచారం చేసే కార్యకర్తకు ఎంత హక్కు ఉందో సోషల్‌ మీడియాకు అంతే ఉందన్నారు. మూడోసారి నరేంద్ర మోదీ సర్కార్‌ రాబోతుందని అమిత్‌షా దీమా వ్యక్తం చేశారు. దేశం నలుమూలల్లో ఎక్కడికి వెళ్లిని మోదీ పేరు మాత్రమే వినిపిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారు.

తెలంగాణలో 12 కంటే ఎక్కువ పార్లమెంట్‌ స్థానాలను బీజేపీ గెలవాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అన్నారు. పదేళ్లలో మోదీ సర్కార్‌ అవినీతిని అంతం చేసిందని చెప్పారు. అన్ని రంగాల్లో ప్రస్తుతం దేశం దూసుకుపోతుందని చెప్పారు. ఐదు వందల ఏళ్ల కల నెరవేర్చిన ఘనత మోదీ సర్కార్‌దే అన్నారు. కాంగ్రెస్‌ 70 ఏళ్ల పాలనలో చేయలేని పనులను అన్నింటినీ ప్రధాని మోదీ చేసి చూపించారన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన ఘనత ఎన్డీఏ సర్కార్‌కు దక్కుతుందని చెప్పారు. మహిళా రిజర్వేషన్ కల్పించారనీ.. ట్రిపుల్ తలాక్‌ తీసేయించామని చెప్పారు. సీఏఏ నిర్ణయం కూడా మోదీ సర్కారే తీసుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారు.

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్‌ పార్టీలు ఒక్కటే అన్నారు. జెండాలు వేర్వేరుగా ఉన్నా కూడా వారంతా కలిసే పనిచేస్తున్నారంటూ విమర్శలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మొత్తం కుటుంబ పార్టీలే అని చెప్పారు. అవినీతికి పాల్పడ్డారంటూ అమిత్‌షా ఆరోపణలు చేశారు. రూ.12 లక్షల కోట్ల అవినీతికి కాంగ్రెస్‌ పాల్పడిందన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే అది మోదీతోనే సాధ్యం అవుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రూ.2లక్షల కోట్లు కాంగ్రెస్ ఖర్చు చేస్తే.. ఒక్క తెలంగాణకే ప్రధాని మోదీ రూ.2లక్షలకు పైగా ఖర్చులు చేశారని అమిత్‌షా చెప్పారు. ఇండియా కూటమితో పాటు బీఆర్ఎస్‌ సహా ఎవరు వచ్చినా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఆపలేరంటూ అమిత్‌షా దీమా వ్యక్తం చేశారు.

Next Story