ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీని గెలిపించే పనిలో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే..! ఆయన ప్రస్తుతం ఇంకొన్ని బాధ్యతలను స్వీకరించారు. పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ ప్రధాన సలహాదారుగా ప్రశాంత్‌ కిశోర్‌ నియమితుడయ్యారు. ఈ విషయాన్ని తెలుపుతూ అమరీందర్‌ సింగ్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. పంజాబ్‌ ప్రజల సంక్షేమం కోసం మరింత సమర్థంగా పని చేయనున్నామని.. పంజాబ్‌ ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్‌ చేసింది. ప్రశాంత్‌ కిశోర్‌కు కేబినెట్‌ ర్యాంకు, హోదాను ఇవ్వడానికి రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇందుకుగాను ప్రశాంత్‌ కిశోర్‌ నెలకు రూ.1 మాత్రమే తీసుకుంటున్నారని చెప్పింది. 2022లో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అమరీందర్‌తో కలిసి ప్రశాంత్‌ కిశోర్‌ పని చేయనున్నారు. 2017 పంజాబ్‌ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిశోర్‌ పని చేశారు. ఆ పార్టీ అప్పట్లో విజయం సాధించింది.

ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్.. ఆయన టీమ్ దృష్టి మొత్తం పశ్చిమ బెంగాల్ చుట్టూ ఉంది. దేశంలో ప్రజాస్వామ్యం కోసం జరిగే కీలక ఎన్నికల పోరాటాల్లో ఒకటి పశ్చిమ బెంగాల్‌లో జరగనుందని ప్రశాంత్‌ కిషోర్‌ అన్నారు. ఈ రాష్ట్రంలో మార్చి 27 నుంచి జరిగే శాసనసభ ఎన్నికలను ప్రస్తావిస్తూ 'సొంత బిడ్డను మాత్రమే కోరుకుంటున్న బెంగాల్‌' అనే తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ) ప్రధాన నినాదాన్ని ట్విటర్‌లో షేర్‌ చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి రూపొందించిన నినాదం అది. బెంగాల్‌ ప్రజలు తమ తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, మే 2న తన చివరి ట్వీట్‌ కోసం వేచిచూడండని కిషోర్‌ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలలో బెంగాల్‌లో బీజేపీ రెండంకెలకు మించి స్థానాలను గెలుచుకుంటే తాను ట్విటర్‌ నుంచి తప్పుకుంటానని గత డిసెంబర్‌ 21న కిషోర్‌ ట్వీట్‌ చేశారు. ఇప్పటికీ ఆ మాటలకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు.


తోట‌ వంశీ కుమార్‌

Next Story