షర్మిల, వైఎస్ జగన్ భేటీపైనే అందరి దృష్టి!
ఈరోజు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ కాబోతున్నారు.
By అంజి Published on 3 Jan 2024 11:50 AM ISTషర్మిల, వైఎస్ జగన్ భేటీపైనే అందరి దృష్టి!
ఈరోజు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ కాబోతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లి, అక్కడి నుండి తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకోనున్నారు. షర్మిల తన కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థం, వివాహానికి వైఎస్ జగన్‌ను ఆహ్వానించనున్నారు. అనంతరం సాయంత్రం షర్మిల విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లనున్నట్టు ఆమె సన్నిహితులు తెలిపారు. మొన్న వైఎస్‌ఆర్ ఘాట్‌లో వైఎస్ విజయమ్మ, త్వరలో కాబోయే దంపతులు రాజారెడ్డి, అట్లూరి ప్రియలతో కలిసి షర్మిల వెడ్డింగ్ కార్డ్‌ను ఉంచి నివాళులర్పించి ఆశీస్సులు తీసుకున్నారు.
సోదరుడు సీఎం జగన్ కుటుంబసభ్యులకు షర్మిల తొలి పెళ్లి కార్డు ఇవ్వనున్నారు. షర్మిల రేపు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న తరుణంలో ఆమె సోదరుడు, సీఎం జగన్‌తో ఇవాళ జరగనున్న భేటీ అందరినీ ఆకర్షిస్తోంది. తన సొంత సోదరుడితో ఆమె రాజకీయ సమీకరణం, భవిష్యత్తులో తలెత్తే రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారనున్నాయి. షర్మిల వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటే ఏపీలో ఆ పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా నిలవనున్నారు. ఇది సీఎం జగన్‌కు పెద్ద అడ్డంకి కానుంది. ఇప్పటికే ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ, జనసేనలు పొత్తు పెట్టుకున్నాయని, ఆ కూటమిలో బీజేపీ కూడా చేరే అవకాశం ఉందని సమాచారం. వీటి కంటే ముందే సీఎం జగన్‌తో షర్మిల భేటీ కానుండటం అందరినీ ఆకర్షిస్తోంది.