కుమారులను రంగంలోకి దింపాలని ఫిక్స్ అవుతున్న నేతలు

Akbaruddin Owaisis son to edu ministers lad check politicians who seek tickets for their heirs. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పలు పార్టీలకు చెందిన అగ్రనేతలు తమ కుమారులకు టిక్కెట్లు ఇప్పించేందుకు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 July 2023 4:28 PM GMT
కుమారులను రంగంలోకి దింపాలని ఫిక్స్ అవుతున్న నేతలు

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పలు పార్టీలకు చెందిన అగ్రనేతలు తమ కుమారులకు టిక్కెట్లు ఇప్పించేందుకు తమ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీలోని ఇతర స్థానిక అభ్యర్థుల నుంచి తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్నవారికి రాజకీయ పలుకుబడి ఉన్నప్పటికీ, కొత్తవారు సీట్ల కోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని సీట్లకు సంబంధించి అనిశ్చితి నెలకొని ఉండగా, మరి కొందరు నేతలు తమ కుమారులకు టిక్కెట్లు ఇప్పించేందుకు తీవ్ర స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు.

కొడుకుల కోసం లాబీయింగ్ చేస్తున్న వారిలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు కూడా ఉన్నారు. మైనంపల్లి రోహిత్‌కి ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు టిక్కెట్‌ ఇప్పించాలని ఆయన తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి మధ్య ఉన్న పోటీ కారణంగా కుమారుడిని రంగంలోకి దింపాలని అనుకుంటూ ఉన్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (సనత్ నగర్), డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గౌడ్ (సికింద్రాబాద్) కూడా తమ కుమారులకు టిక్కెట్ల కోసం లాబీయింగ్ చేస్తున్నారు. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని తన కుమారుడు సాయికిరణ్ కోసం లాబీయింగ్ చేస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతిలో కిరణ్ ఓడిపోయారు. పద్మారావు కుమారుడు టి రామేశ్వర్ గౌడ్ కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశావహుల్లో ఉన్నారు. స్థానికంగా పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఉన్నారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తనయుడు ముఠా జైసింహ కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నాడు. జైసింహ నియోజకవర్గంలో క్రియాశీలంగా పని చేస్తూ ఉన్నారు.

రాజేంద్రనగర్‌ నుండి విద్యాశాఖ మంత్రి కుమారుడు

విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు, పి కార్తీక్ రెడ్డి రాజేంద్రనగర్ నుండి టికెట్ కోరుతున్నాడు. మరో వైపు సబితా ఇంద్రా రెడ్డి తీగల కృష్ణా రెడ్డి నుండి స్థానికంగా సవాలును ఎదుర్కొంటూ ఉంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన టి.ప్రకాష్ గౌడ్ కారణంగా రాజేంద్రనగర్‌లో కార్తీక్‌కు టికెట్ ఇవ్వడం కష్టమేనని అంటున్నారు. గెలిచే అభ్యర్థులకే టిక్కెట్లు ఇవ్వాలనే ఆలోచనతో బీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారు. జూన్ 1న మంత్రి కెటి రామారావు ఇన్‌చార్జ్‌లకే తప్పకుండా టిక్కెట్లు ఇస్తామనే విషయమై క్లారిటీ ఇవ్వకపోవడంతో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ కుమారులకు టిక్కెట్లు దక్కేలా ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు.

అక్బరుద్దీన్ తన కుమారుడిని బరిలోకి దింపుతాడా?

ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ తన కుమారుడిని ఈ ఏడాది ఎన్నికల్లో పోటీకి దింపే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి. వృత్తి రీత్యా డాక్టర్ అయిన నూరుద్దీన్ ఒవైసీ చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. గత బడ్జెట్ సెషన్‌లో తమ పార్టీ 50 స్థానాల్లో పోటీ చేస్తుందని అక్బరుద్దీన్ చెప్పినప్పటికీ, BRSను ఇబ్బంది పెట్టేలా అన్ని స్థానాల్లో పోటీకి దింపే అవకాశాలు చాలా తక్కువే అని అంటున్నారు.

పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తాము మునుపటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. ఎన్నికలకు ముందు ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. AIMIM, BRS పార్టీల మధ్య సంబంధాలు కూడా కీలకంగా మారాయి.

రాజా సింగ్ సస్పెన్షన్.. విక్రమ్ గౌడ్‌ కు కలిసొచ్చేనా

గోషామహల్ నియోజకవర్గం అంటే రాజా సింగ్. ఇప్పుడు రాజా సింగ్ బీజేపీలో లేరు. ఆయన సస్పెన్షన్ ను ఎదుర్కొంటూ ఉన్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఎం ముఖేష్ గౌడ్ కుమారుడు ఎం విక్రమ్ గౌడ్ భారతీయ జనతా పార్టీ తరపున టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాజా సింగ్ పై ఎప్పుడు సస్పెన్షన్ ఎత్తేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో విక్రమ్ గౌడ్ తన ప్రయత్నాల్లో తాను ఉన్నారు.

ఒకే సీటు కోసం.. ఎంతో మంది పోటీ:

బీఆర్ఎస్ అధినేత చేయించిన సర్వేలో ముప్పై మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని తేలింది. ఇప్పటికే ఆయా నాయకులకు హెచ్చరికలు పంపారు. వాళ్లు తమ పద్ధతులు మార్చుకోవాల్సిందేనని సూచించారు. వాళ్లెవరు అనే విషయం బీఆర్ఎస్ నుండి బయటకు రాకపోయినా.. పలువురు నాయకుల పేర్లు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో దూసుకుపోవాలని మరికొందరు నేతలు ప్రయత్నిస్తూ ఉన్నారు. నియోజకవర్గంలో తమ సత్తా చూపించుకోడానికి పలువురికి అవకాశం ఉంది.

ఈ ఏడాది ప్రారంభంలో జి సాయన్న మరణంతో ఖాళీ అయిన కంటోన్మెంట్ నియోజకవర్గం (ఎస్‌సి)తో పాటు, ఉప్పల్ వంటి ఇతర నియోజకవర్గాల్లో పలువురు అభ్యర్థులు ఉన్నారు. కవాడిగూడ మాజీ కార్పొరేటర్‌గా ఉన్న సాయన్న కుమార్తె జి లాస్య నందిత క్రియాశీలకంగా మారారు. అయితే, నియోజకవర్గం నుంచి కనీసం నలుగురు దాకా పోటీదారులు ఉన్నారు. వీరిలో టీఎస్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఎండీసీ) చైర్మన్‌, ఓయూజేఏసీ మాజీ నేత క్రిశాంక్‌ మన్నె, టీఎస్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, టీఎస్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌బీసీ) చైర్మన్‌ గజ్జల నగేశ్‌, 2018 నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసిన గణేష్‌ నారాయణ్‌లు ఉన్నారు.

మరోవైపు ఉప్పల్ ఎమ్మెల్యే సుభాస్ రెడ్డికి పార్టీలో తీవ్ర సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రధాన పోటీదారులలో మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత భర్త మోతె శోభన్ రెడ్డి కూడా ఉన్నారు.

మారుతున్న రాజకీయ సమీకరణాలు.. సరికొత్త ఆశలు

24 అసెంబ్లీ నియోజకవర్గాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోకి రావడంతో నేతలు తమ సత్తాను చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో BRS లేదా AIMIM అధికారంలో ఉన్నాయి. అయితే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉండడంతో ఎవరికి వారు తమ తమ ప్రయత్నాల్లో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎంత మంది కొత్త అభ్యర్థులను చూస్తామో కాలమే సమాధానం చెబుతుంది.


Next Story