ప్రస్తుతం ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పంజాబ్‌లోనూ పాగా వేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. అందులో భాగంగానే ఇప్పటికే ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్‌లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా పంజాబ్ సీఎం అభ్యర్థిని ఆ పార్టీ ప్రకటించింది. పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్ పేరును ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు మొహాలీలో జరిగిన విలేకరుల సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.
ప్రజల ఓటింగ్ ఆధారంగా సీఎం అభ్యర్థిని ఎంచుకున్నట్లు తెలిపారు. ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్‌లు, వాట్సాప్ మెసేజ్‌ల ద్వారా లక్షలాది మంది భగవంత్ మాన్ కు మద్దతు తెలిపారన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో 93 శాతం మంది భగవంత్ పేరును సిఫార్సు చేశారని పేర్కొన్నారు. కాగా.. భగవంత్ మాన్ ప్రస్తుతం పంజాబ్ ఆప్ శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 20న జరగనుంది. మార్చి 10న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్, అకాలీదళ్ ల మధ్యే ప్రధానంగా పోటి నెలకొంది.