ఈ శ‌బ‌రి బైరెడ్డి సిద్దార్థ‌రెడ్డిని త‌ట్టుకోగ‌ల‌దా..?

By అంజి  Published on  20 Jan 2020 2:53 AM GMT
ఈ శ‌బ‌రి బైరెడ్డి సిద్దార్థ‌రెడ్డిని త‌ట్టుకోగ‌ల‌దా..?

బైరెడ్డి సిద్దార్థ‌రెడ్డి, క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో ఈ పేరు ఒక సంచ‌ల‌నం. చిన్న వ‌య‌సులోనే పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన సిద్దార్థ‌రెడ్డి నందికొట్కూరు కీల‌క నేత‌గా మారారు. దాంతోపాటు ప్రస్తుత ట్రెండ్‌కు త‌గ్గ‌ట్టు సోష‌ల్ మీడియాలో త‌న‌కంటూ ప్ర‌త్యేక ఆర్మీ ఏర్పాటైంది. మ‌రోప‌క్క సిద్దార్థ‌రెడ్డి ప్ర‌సంగాల వీడియోల‌కు వ‌స్తున్న వ్యూస్‌ యువ‌త‌లో త‌న‌కున్న‌ క్రేజ్‌ ఏపాటిదో ఇట్టే అర్ధం చేసుకోవ‌చ్చు.

ప్ర‌స్తుతం వైసీపీ నేత‌గా ఉన్న‌ బైరెడ్డి సిద్దార్థ‌రెడ్డి త‌న తొలినాళ్ల‌ రాజ‌కీయాల్లో పెద‌నాన్న బైరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డితో క‌లిసి న‌డిచారు. మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో రాజ‌శేఖ‌ర్‌రెడ్డిని వీడిన సిద్దార్థ‌రెడ్డి జ‌గ‌న్ చెంత చేరారు. ఇక అప్ప‌ట్నుంచి త‌న‌కంటూ సొంత రాజ‌కీయ వ‌ర్గాన్ని ఏర్ప‌రుచుకున్నారు. దాంతో సిద్దార్థ‌రెడ్డి ప్రాబ‌ల్యం క‌ర్నూలు జిల్లాలో ఒకింత పెరిగింద‌నే చెప్పొచ్చు.

త‌న‌ను వీడి వైసీపీలో చేరిన బైరెడ్డి సిద్దార్థ‌రెడ్డిపై ఇప్ప‌టికీ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఫైర‌వుతూనే ఉంటారు. ఇటీవ‌ల కాలంలో ప్రముఖ మీడియా ఛానెళ్ల‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూల‌లో సైతం అత‌ను చిన్న‌పిల్లాడు, ఉడుకు ర‌క్తం క‌నుక ఆవేశంలో ఏదైనా మాట్లాడుతాడు. దాని ప‌రిణామాలు భ‌విష్య‌త్తులో తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చ‌రిక‌లు కూడా చేశాడు. ఇలా త‌న రాజ‌కీయ వారసుడు సిద్దార్థ‌రెడ్డి కాద‌న్న విష‌యం మీడియా ద్వారా చెప్ప‌క‌నే చెప్పాడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి.

తాజాగా, బైరెడ్డి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి త‌న రాజ‌కీయ వార‌సులు ఎవ‌ర‌న్న విష‌యంపై పూర్తి క్లారిటీ ఇస్తూ త‌న కుమార్తె శ‌బ‌రిని పొలిటిక‌ల్ స్ర్కీన్‌కు ప‌రిచ‌యం చేశాడు. ప‌రిచ‌యం చేయ‌డం మొద‌లు వెంట‌నే బీజేపీ జాతీయ నేత‌ల‌తో ఆ పార్టీ కండువాను శ‌బ‌రి మెడ‌లో వేయించేశారు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. అలా తండ్రి, కూతురు ప్ర‌స్తుతం బీజేపీ పంచ‌న చేరారు.

సిద్దార్థ‌రెడ్డి ప్రాబ‌వాన్ని త‌గ్గించేందుకే రాజ‌శేఖ‌ర్‌రెడ్డి త‌న వారుసురాలిగా శ‌బ‌రిని బాహ్య ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశాడ‌న్న టాక్ పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. మొన్న‌టి వ‌ర‌కు త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు సైతం ముఖ ప‌రిచ‌యం లేని ఆమె ప్ర‌స్తుత పాలిటిక్స్‌లో యాక్టివ్ అయ్యారు. సొంత నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లం పెంచుకునేందు సేవా కార్య‌క్ర‌మాలను ముమ్మ‌రం చేశారు. నేటి త‌రానికి త‌గ్గ‌ట్టు సోష‌ల్ మీడియాను సైతం మెయింటైన్ చేస్తున్నారు.

రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్లాన్‌..

నిజానికి, బైరెడ్డి ఫ్యామిలీ సీఎం జ‌గ‌న్ అంటే ఆమ‌డ దూరం ఉంటుంది. అంత‌లా జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త చూపుతుంది ఆ కుటుంబం. అటువంటిది త‌న‌కు తెలియ‌కుండా సిద్దార్థ‌రెడ్డి వైసీపీ కండువా క‌ప్పుకున్నాడ‌న్న కోపం రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అప్పుడప్పుడు ప్ర‌ద‌ర్శిస్తుంటాడ‌ని ఆయ‌న అనుచ‌ర‌వ‌ర్గం చెబుతోంది. ఈ విష‌యాన్ని బాహ్య ప్ర‌పంచానికి చెప్ప‌క‌పోయినా సిద్దార్థ‌రెడ్డికి వ్య‌తిరేకంగా త‌న ప‌ని తాను చేసుకుపోతున్నాడ‌ట రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. ఇప్పుడు ఇదే క‌ర్నూలు జిల్లాలో ఇయ‌ర్ స్టార్టింగ్ టాక్ అయింది.

ఎలా అయినా త‌న కూతురు శ‌బ‌రిని రాజ‌కీయంగా అగ్ర‌స్థానానికి చేర్చి సిద్దార్థ‌రెడ్డిని డౌన్ చేయాల‌న్నది రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్లాన్‌గా ఉంద‌ని, అందులో భాగంగానే ప‌క్కా ప్ర‌ణాళిక ప్ర‌కారం శ‌బ‌రి మెడ‌లో రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిన బీజేపీతో కండువా క‌ప్పించార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. శ‌బ‌రి మాత్రం మొన్న‌టి వ‌ర‌కు తండ్రి చాటు బిడ్డ‌గా ఉంటూ వ‌చ్చింది.

ఇలా సిద్దార్థ‌రెడ్డికి రాజ‌కీయ పోటీగా రాజ‌శేఖ‌ర్‌రెడ్డి తీసుకొచ్చిన శ‌బ‌రి ఫాలోయింగ్‌ను పెంచుకోవ‌డంలో బాగా వెనుక‌బ‌డింద‌ని, అటువంటి ప‌రిస్థితుల్లో మారిన రాజ‌కీయాల‌కు ఆమె త‌గ‌ర‌నే విమ‌ర్శ సైతం వినిపిస్తోంది. మ‌రోప‌క్క‌, సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌గా ఉన్న తండ్రి అండ ఉన్నా, అది కేవ‌లం పొలిటిక‌ల్ తెర‌కు ప‌రిచ‌యం వ‌ర‌కే ప‌నిచేస్తుంద‌ని, ఆ త‌రువాత సీన్‌ను పండించే బాధ్య‌త ఎంట్రీ ఇచ్చిన వారిపైనే ఉందంటున్నారు విశ్లేష‌కులు. ఈ నేప‌థ్యంలో అప్పుడప్పుడూ మైక్ ముందుకొస్తున్న శ‌బ‌రి సిద్దార్ధరెడ్డినే టార్గెట్ చేసుకుని స్పీచ్‌లు ఇస్తోంది. బెదిరింపు రాజకీయాలకు భయపడేది లేదని, రాయలసీమ ప్రజల కోసం తాను ఏమైనా చేస్తానంటూ ప్ర‌సంగాలిచ్చేస్తుండటం విశేషం.

Next Story