ఏపీ: ఖాకీల కన్నెర్ర.. వలస కూలీలపై విరిగిన లాఠీ (వీడియోతో)
By సుభాష్ Published on 16 May 2020 8:23 AM GMTరెక్కాడితే డొక్కాడని వలస కూలీలపై ఏపీ పోలీసులు లాఠీలతో ప్రతాపం చూపించారు. ఏ తప్పు చేయని వారిపై లాఠీతో మోత మోగించారు. అయితే లాఠీలతో చితకబాదడం ఏపీ పోలీసులకు ఇది కొత్తేమి కాదు..లాక్‌డౌన్ నేపథ్యంలో ఇటీవల కూడా జనాలపై లాఠీలతో చితకబాదిన ఘటనలు జరిగాయి. ఇక తాజాగా వలస కూలీలపై మరోసారి లాఠీ విరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మణిపాల్ ఆసుపత్రి వద్ద శనివారం ఉదయం పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో కూలీలు భయంతో పరుగులు తీశారు.
వివరాల్లోకి వెళితే.. శుక్రవారం సాయంత్రం రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న కూలీలను అటుగా వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గమనించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారిని పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడి నుంచి స్వస్థలాలకు పంపించాలని అధికారులను ఆదేశించారు.
దీంతో రహదారిపై వెళ్తున్న ఉత్తరప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 1000 మంది వలస కూలీలను తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌కు తరలించారు. వీరిలో కొంతమంది కాలినడకన, మరికొందరు సైకిళ్లపై వెళ్లేవారు ఉన్నారు. అయితే శనివారం ఉదయం పునరావాస కేంద్రంలో అల్పాహారం పంపిణీ చేస్తున్న క్రమంలో సైకిళ్లపై వచ్చిన కూలీలు కొందరు తిరుగు ప్రయాణమయ్యారు.
సుమారు 150 మంది కూలీలు విజయవాడ కనకదుర్గమ్మ వారధి వద్దకు చేరుకోగానే పోలీసులు గుర్తించి వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిపై లాఠీఛార్జి చేయడంతో కూలీలు భయంతో పరుగులు తీశారు. ఈ లాఠీఛార్జ్‌తో చాలా మంది వలస కూలీలకు గాయాలయ్యాయి. అనంతరం వారందరినీ విజయవాడ క్లబ్‌కు తీసుకొచ్చి వివరాలు నమోదు చేసుకుంటున్నారు.
అయితే లాక్‌డౌన్ కారణంగా ముందు కూలీ పనులు లేక, తినేందుకు సరైన తిండి లేక నానా అవస్థలకు గురవుతున్న వలస కూలీలపై ఎలా లాఠీలతో చితకబాదడం దారుణమని కొందరు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కూడా పోలీసులు రోడ్లపైకి వచ్చిన జనాలపై కూడా ఇష్టమొచ్చినట్లు చితకబాదడంపై తీవ్ర కలకలం రేపింది. కొందరు పోలీసులు సస్పెండ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయని, ఇలాంటి విపత్కర నేపథ్యంలో కూలీలపై ఇలాంటి దారుణానికి పాల్పడటం సరైంది కాదని పలువురు మండిపడుతున్నారు.
�