మార్కెట్ లో సామాజిక దూరం పాటించని ప్రజలు.. పోలీసు ఏమి చేశాడంటే..?

By సుభాష్  Published on  6 Jun 2020 3:54 AM GMT
మార్కెట్ లో సామాజిక దూరం పాటించని ప్రజలు.. పోలీసు ఏమి చేశాడంటే..?

ప్రయాగరాజ్: ఉత్తరప్రదేశ్ సబ్-ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసును అక్కడి అధికారులు సస్పెండ్ చేయడమే కాకుండా.. ప్రయాగరాజ్ జిల్లా నుండి బదిలీ చేయించారు. ఆయన చేసిన పని ఏమిటో తెలుసా..? సినిమాల్లో ఛేజింగ్ సీన్లలో తమ కార్లకు అడ్డు వచ్చిన కూరగాయల బండ్లను ఎలా అయితే గుద్దుకుంటూ వెళతారో.. అచ్చం అలా ఆయన తన వాహనంతో వెళ్లారు. స్థానిక మార్కెట్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను పోలీసు డిపార్ట్మెంట్ సహించదని.. ప్రయాగ్ రాజ్ పోలీసు ఛీఫ్ సత్యార్థ్ అనిరుధ్ పంకజ్ తెలిపారు. అతన్ని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులను జారీ చేశారు. (ఇది చదవండి: హైదరాబాద్‌లో నాలుగు హత్యలు.. నగరంలో తీవ్ర కలకలం)

ఈ ఘటనకు సంబంధించిన రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఘోర్ పుర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న మార్కెట్ దగ్గరకు పోలీసు కారు వేగంగా దూసుకుని వచ్చింది. పోలీసు జీపు అంత వేగంగా దూసుకురావడం చూసి మార్కెట్ లోని వాళ్ళు భయపడి పక్కకు వెళ్లారు.. అంతే వేగంతో ఆ వాహనం అక్కడ ఉన్న తోపుబళ్లను గుద్దేసింది. వెంటనే ఆ బల్లపై ఉన్న కూరగాయలు, పళ్ళు కిందపడిపోయాయి. వెంటనే రివర్స్ గేర్ వేసి కింద పడిన కూరగాయలపై వేగంగా కారును డ్రైవ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన జరుగుతున్న సమయంలో ప్రజలు భయభ్రాంతులకు గురై పారిపోవడం ఆ వీడియోలలో చూడొచ్చు. చాలా ప్రమాదకరంగా ఆ వాహనాన్ని డ్రైవ్ చేశారు.

ఆయన అలాంటి నిర్ణయం తీసుకోడానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలీలేదు. సామాజిక దూరం పాటించమని అడుగుతున్నా కూడా ఎవరూ పట్టించుకోకుండా ఉండడంతో ఆయన అలా చేశారని తెలుస్తోంది. సామాజిక దూరం పాటించమని ఎన్ని సార్లు కోరినా కూడా అక్కడ గుంపులు గుంపులుగా ఉంటూ ఉండడంతో విసుగెత్తిపోయిన ఆయన ఇలా వాహనంతో భయభ్రాంతులకు గురిచేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యి.. చివరికి సస్పెండ్ వరకూ దారి తీసింది.

సామాజిక దూరం పాటించమని అధికారులు పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా ప్రజలలో మార్పు రావడం లేదు. ఏ ఊర్లో చూసినా మార్కెట్ లలో కనీస దూరం పాటించడం లేదు. కరోనా మహమ్మారి సోకకుండా ప్రజలు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం.. ఏమవుతుందిలే అన్న నిర్లక్ష్య ధోరణి కారణంగా దేశంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి.

Next Story