హైదరాబాద్‌లో నాలుగు హత్యలు.. నగరంలో తీవ్ర కలకలం

By సుభాష్  Published on  6 Jun 2020 3:34 AM GMT
హైదరాబాద్‌లో నాలుగు హత్యలు.. నగరంలో తీవ్ర కలకలం

హైదరాబాద్‌లో వరుస హత్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. నగరంలో ఒకే రోజు నాలుగు హత్యలు జరిగాయి. రౌడీషీటర్లు కత్తులతో పొడుచుకున్నారు. శుక్రవారం అర్థరాత్రి మెహదీపట్నం, గోల్కొండలలో ఇద్దరు రౌడీషీటర్లు దాడి చేసుకుని ఇద్దరు మృతి చెందారు. అలాగే ఆలివ్‌ ఆస్పత్రి సమీపంలో చాంద్‌ మహ్మద్‌ , ఫయాజుద్దీన్ అనే ఇద్దరు రౌడీషీటర్లు నడిరోడ్డుపై కత్తులతో దాడి చేసుకున్నారు. ఈఘటనలో ఇద్దరు కూడా ఘటన స్థలంలోనే చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి క్లూస్‌ టీమ్‌ వచ్చి వివరాలు సేకరించింది. (ఇది చదవండి: దారుణం.. భర్త మర్మాంగం కోసేసి..)

హైదరాబాద్‌లో ఒకే రోజు నాలుగు హత్యలు జరగడంపై తీవ్ర కలకలం రేపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండకు చెందిన రౌడీషీటర్‌ చాందీ షేక్‌ మహ్మద్‌, చికెన్‌ సెంటర్‌ యజమాని అయిన అతని మిత్రుడు ఫయాజుద్దీన్‌లు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఎండీ లైన్‌ నుంచి గోల్కొండకు బైక్‌ పై వెళ్తున్నారు. వీరిని గమనించిన ముగ్గురు ప్రత్యర్థులు క్వాలిస్‌ వాహనంలో వారిని వెంబడించి మొరైన్‌ బేకరీ వద్ద బైక్‌ను ఢీకొట్టారు. దీంతోకింద పడిపోయిన షేక్‌ మహ్మద్‌, ఫయాజుద్దీన్‌లను పట్టుకుని ముగ్గురు కత్తులతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. దీంతో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పోలీసులను గమనించిన వీరు క్వాలిస్‌ వాహనం అక్కడే వదిలేసి పరారయ్యారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఇద్దరు మృతి చెందారు.

అలాగే గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మరో హత్య చోటు చేసుకుంది. మల్లెపల్లికి చెందిన రాహుల్‌ అగర్వాల్‌ (27), అదే ప్రాంతానికి చెందిన అజయ్‌ (28)లు చిన్ననాటి మిత్రులు. రాహుల్‌ మెడికల్‌ షాపు నడుపుతున్నాడు. అయితే వీరిద్దరి మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అల్లాపూర్‌ శ్మశాన వాటిక సమీపంలో రాహుల్‌ మృతదేహాన్ని గుర్తించిన స్థానికుల పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హత్య జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. అజారే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల నిర్ధారించారు.పరారీలో ఉన్న అజర్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇక యాకుత్‌పురా చున్నేకిబట్టి చందానగర్‌కు చెందిన మహ్మద్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ (26) దారుణహత్యకు గురయ్యాడు. రోడ్డు మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తుండగా, ఇమ్రాన్‌పై దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఈ హత్యకు ఆస్తి వివాదాలే కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలా ఒకే రోజు నగరంలో నాలుగు హత్య చేసుకోవడంపై తీవ్ర కలకలం రేపుతోంది. నగరంలో ఇప్పటికే ఎన్నో హత్యలు జరిగాయి. కరోనా కారణంగా హత్య, అత్యాచారాలు లాంటివి క్రైమ్‌ రేటు పూర్తిగా తగ్గుముఖం పట్టినా.. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత ఇలాంటి దారుణాలో మళ్లీ మొదలయ్యాయి.

Next Story
Share it