హైదరాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఢిల్లీ, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. దేశంలో జరుగుతున్న ఆందోళనలపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీటర్‌ వేదికగా స్పందించారు. పౌరసత్వం సవరణపై ఆందోళన జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆందోళనల వెనుక ప్రతిపక్ష పార్టీల కుట్ర ఉందని మోదీ ఆరోపించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు నిరసన తెలిపి హక్కు ఉందని.. కానీ ప్రజా సంపదను ధ్వంసం చేయడం సరికాదన్నారు. సాధారణ జనజీవనాన్ని దెబ్బతీయడం సరికాదని.. ప్రజలు సంయమనం పాటించాలన్నారు. పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు. పౌరసత్వ సవరణ వల్ల దేశంలో ఏ మతానికి చెందిన వారికి ఎటువంటి నష్టం వాటిల్లదని తెలిపారు. ఈ చట్టం గురించి దేశ ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. భారత్‌లో పౌరసత్వం కోరుకునేవారికి మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందని మోదీ తెలిపారు. అందరం కలిసి దేశ అభివృద్ధి పాటుపడాలన్నారు. ఆందోళనలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పలు చోట్ల నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జామియా, ఏఎంయూ యూనివర్సిటీల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. కాగా పౌరసత్వ చట్టంపై దేశ వ్యాప్తంగా అవగహన కార్యక్రమాలు నిర్వహిస్తామని బీజేపీ ప్రకటించింది. ఏ వర్గానికి కూడా ఈ చట్టం వ్యతిరేకంగా లేదని.. ఈ విషయాన్ని దేశ ప్రజలకు తమ పార్టీ కార్యకర్తలు వివరిస్తారని బీజేపీ తెలిపింది.

అంజి గోనె

Next Story