ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Sept 2020 12:55 PM IST
ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం..!

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా నిత్యం దేశంలో 90వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఒకప్పుడు పట్టణాలకు మాత్రమే పరిమిత కేసులు.. ఇప్పడు గ్రామాల్లో సైతం పెరిగిపోతున్నాయి. దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదు అవుతున్న ఏడు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. దిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో నాలుగు రాష్ట్రాల సీఎంతో ఈ నెల 23న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడనున్నట్లు సమాచారం. కరోనా మహమ్మారి వ్యాప్తి నియంత్రణకు ఆయా రాష్ట్రాలు చేపడుతున్న చర్యలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

కాగా.. గడిచిన 24గంటల్లో భారత్‌లో 92,605 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 1,133 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర, ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 54,00,620కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 43,03,044 మంది కోలుకోగా.. 10,10,824 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 86,752 మంది చనిపోయారు. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 79.28శాతంగా ఉండగా.. మరణాలు రేటు 1.61శాతంగా ఉంది. దేశంలోని దాదాపు 60శాతం కేసులు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లోనే నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ప్రపంచంలో అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు అమెరికాలో నమోదు అవుతుండగా.. ఆతరువాతి స్థానంలో ఇండియా ఉండడం గమనార్హం.

Next Story