బ్రేకింగ్: పేదలకు ఉచితంగా రేషన్ ఇస్తాం: ప్రధాని మోదీ
By సుభాష్ Published on 30 Jun 2020 10:51 AM GMTదేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉన్నందున నవంబర్ వరకు పేదలకు ఉచితంగా రేషన్ సరుకులు ఇస్తామని, వన్ నేషన్-వన్ రేషన్‌ను ప్రకటించామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మంగళవారం మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. కుటుంబంలో ప్రతీ ఒక్కరికి ఐదు కిలోల గోధుమలు లేదా బియ్యం ఇస్తామన్నారు. ఉచిత రేషన్ కోసం రూ. 90వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామన్నారు. కరోనాతో పోరాడేందుకు అన్‌లాక్ 2.0లోకి వస్తున్నామని అన్నారు. వర్షాలు పడే సమయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా వైరస్ విషయంలో చూస్తే ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఎంతో మెరుగ్గా ఉన్నామని, సరైన సమయంలో లాక్‌డౌన్ విధించడం వల్ల నష్టాలు తగ్గించుకోగలిగామని పేర్కొన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. లాక్‌డౌన్ విధించడం వల్ల ప్రాణ నష్టం కూడా ఎంతో తగ్గించుకోగలిగామన్నారు.
కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో కంటోన్మెంట్ జోన్‌లలో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కరోనా కు వ్యాక్సిన్ లేని కారణంగా ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, అలాగే ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. లాక్‌డౌన్ విధించడం వల్ల అనేక మంది ప్రాణాలు కాపాడగలిగామన్నారు. కేసులు పెరుగుతున్న సమయంలో నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. పబ్లిక్‌ప్లేస్‌లో మాస్కు పెట్టుకోలేదని ఓ దేశ ప్రధానికే జరిమానా విధించారని మోదీ గుర్తు చేశారు. అందుకే సర్పంచ్ నుంచి ప్రధాని వరకూ ఎవ్వరూ కూడా నియమాలకు అతీతులు కారని స్పష్టం చేశారు. ఇలాంటి విపత్కర సమయంలో పేదలు ఆకలితో అలమటించే పరిస్థితి లేకుండా చూసుకున్నామన్నారు. పేదలకు రూ.లక్షా 75 కోట్లు కేటాయించామని, గరీబ్ కళ్యాణ్ పథకం కింద రూ. 50వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు.