ఢిల్లీ: సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటా అని ప్రకటించి సెన్షేషన్ క్రియేట్‌ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. తాను చెప్పినట్లుగానే సమాజానికి స్ఫూర్తినిచ్చే మహిళలకు తన సోషల్‌మీడియా ఖాతాలను అప్పగించారు. మార్చి 8 మహిళ దినోత్సవ వేళ సోషల్‌ మీడియా ఖాతాలైన ట్విటర్‌, యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లను ఎదుటివారికి స్ఫూర్తిగా నిలిచిన మహిళలకు అప్పగించారు. మహిళ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ.. నారీ శక్తి స్ఫూర్తికి, విజయాలకు జోహార్లు అని అన్నారు. ఇలా చేయడం ద్వారా వారు చేస్తున్న సామాజిక సేవ చేస్తున్న ఏడుగురు మహిళలు.. లక్షలాది మందిని ఉత్సహపరిచినట్లు అవుతుందన్నారు. చెప్పినట్లుగానే తన అకౌంట్స్‌ సైన్‌ ఆఫ్‌ చేశారు. శక్తివంతమైన ఏడుగురు మహిళలు తమ జీవిత ప్రయాణాన్ని నా అకౌంట్ల ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తారంటూ ట్వీట్‌ చేసిన ప్రధాని మోదీ.. తన ఖాతాలను మహిళలకు అప్పగించారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన నారీ శక్తి కల్పన రమేష్‌ కూడా ఉంది.

కల్పన రమేష్, హైదరాబాద్‌

హైదరాబాద్‌ చెందని కల్పన రమేష్‌ ఆర్కిటెక్చర్‌, డిజైనింగ్‌లో నిపుణురాలు. ఆమె తన జీవితాన్ని పూర్తిగా నీటి సంరక్షణకు అంకితం చేశారు. పరిశుభ్రమైన, స్వచ్ఛమైన నీటిని తాగేందుకు.. ఆమె డిజైన్‌ చేసిన నీటి సంరక్షణను విస్తృత ప్రచారం చేస్తున్నారు. పదేళ్ల క్రితం అమెరికా నుంచి తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన కల్పన రమేష్‌.. తాగునీటి మౌలిక సదుపాయాలను చూసి బాధపడ్డారు. ఎలాగైన ఈ పరిస్థితి మార్చాలని ఆమె కంకణం కట్టుకొని పని చేశారు. భవిష్యత్‌ తరాలకు నీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చేసేందుకు ఆమె నిరంతరం కష్టపడుతున్నారు. సహజసిద్ధంగా మనకు లభించిన అత్యంత సులువైన నీటిని.. ఇష్టారాజ్యంగా వృథా చేయకూడదు. బొట్టు బొట్టు ఒడిసిపట్టుకోవాలి. నీటిని రీసైక్లింగ్‌ చేసి మళ్లీ వాడుకోవాలని ఆమె ట్వీట్ చేశారు. ఆమె వాన నీటి సంరక్షణ కోసం కూడా కృషి చేస్తున్నారు.

విజయ పవార్, మహారాష్ట్ర

మహారాష్ట్రలోని ఓ మారుమూల గిరిజన ప్రాంతంలో విజయ పవార్‌ పుట్టారు. బంజారా కులంలో సంప్రదాయ హస్తకళలకు ఆమె ప్రోత్సహమిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా బంజారా చేతివృత్తుల మహిళలతో కలిసి ఆమె పని చేస్తున్నారు. వారు తయారు చేసిన హ్యాండీక్రాఫ్ట్స్‌ను ప్రత్యేక మేళాలు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. బంజారా హ్యాండీక్రాప్ట్స్‌ను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె ట్వీట్‌ చేశారు.

ఆరిఫా జాన్, కశ్మీర్‌

జమ్ముకశ్మీర్‌కు చెందిన అరిఫాజాన్‌ చేతి వృత్తుల కళాకారిణి. ప్రస్తుతం ఆమో నమ్దా అనే చేతివృత్తుల కళను పునరుద్ధరించే పనిలో ఉన్నారు. వాటికి ప్రత్యేకంగా ఓ బ్రాండ్‌ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అయితే సంప్రదాయానికి ఆధునికత జోడిస్తే అద్భుతాలు చేయవచ్చని ఆరీఫా అంటున్నారు. దీని వల్ల మహిళా కళాకారులకు సాధికారత వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని తనను ఎంపిక చేసుకొని సోషల్‌ మీడియా అకౌంట్‌ని తనకు ఇవ్వడం ఎంతో ఉత్తేజాన్ని కలిగించిందని ఆమె అన్నారు.

స్నేహ మోహన్‌ దాస్, చెన్నై

ఆకలిపై పోరాటం సాగిస్తున్న ఆధునిక ఆలోచనాశాలి స్నేహ మోహన్‌ దాస్‌. ప్రతి పేదవారికి పట్టెడన్నం పెట్టేందుకు ఫుడ్‌ బ్యాంక్‌ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ఆకలితో ఉన్న వారి కడుపు నింపుతూ అందరికీ అమ్మయింది. తన విజయానికి మా అమ్మే స్ఫూర్తి అంటూ.. ఓ వీడియో క్లిప్‌ను అప్‌లోడ్‌ చేశారు. ఆహార వృథాను అరికట్టగలిగితేనే దేశంలో ఆకలి కేకలు వినిపించవని ఆమె అంటుంటారు. ఈ విషయంలో అందరూ చేతులు కలపాలని స్నేహ మోహన్‌ దాస్‌ ప్రధాని అకౌంట్‌ నుంచి పిలుపునిచ్చారు.

డాక్టర్‌ మాళవిక అయ్యర్‌

13 ఏళ్ల వయసులో మాళవిక అయ్యర్‌ బాంబు పేలుళ్లలో తన రెండు చేతులను, కాళ్లను కోల్పోయారు. తమిళనాడుకు చెందిన మాళవిక అయ్యర్‌ కుటుంబ ప్రోత్సహంతో పీహెచ్‌డీ పూర్తి చేశారు. అమె ఒంటి నిండా ఫ్రాక్చర్లే అయిన అయినా ఆమె ఏనాడూ వెనకడుగు వేయలేదు. దివ్యాంగుల హక్కుల కోసం పోరాడుతున్న మాళవిక.. ఇది వరకు రాష్ట్రపతి అవార్డు కూడా అందుకుంది. జీవితం ఏమిచ్చినా దానిని పూర్తిగా అంగీకరించి ముందడుగ వేయ్యాలని, అప్పుడే జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోగలం అంటూ మాళవిక అయ్యర్‌ తనను తాను పరిచయం చేసుకున్నారు.

వీణా దేవి, బిహార్‌

మష్రూమ్‌ మహిళ అంటే బిహార్‌లో వీణాదేవి ఇట్టే గుర్తు పట్టేస్తారు. ముంగూర్‌కు చెందిన వీణాదేవి పుట్టగొడుగుల సాగుతో పేరుగాంచారు. పుట్టగొడుగులు పండించేందుకు స్థలం లేక.. తన ఇంట్లోని మంచం కింద పుట్టగొడుగులు సాగు చేశారు. బెల్హార్‌లో మహిళా రైతులకు పుట్టగొడులను సాగు చేయడంలో ఆమె శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటికే ఆమె ప్రభావంతో ముంగూర్‌ జిల్లాలో 105 గ్రామాల్లో పుట్టగొడుగులను పండిస్తున్నారు.

కళావతి దేవి, కాన్పూర్‌

కాన్పూర్‌కు చెందిన కళావతి దేవి.. ఓ తాపిమెస్త్రీ. విరాళాలు సేకరించి ఆ డబ్బుతో టాయిలెట్లు కట్టిస్తున్నారు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఆమె.. బహిరంగ మల విసర్జనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. కాన్పూర్‌ పరిసర గ్రామాల్లో దాదాపు 4 వేలకు పైగా టాయిలెట్లు నిర్మించి.. మహిళల్లో అవగాహన కల్పిస్తున్నారు. కళావతికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.