నువ్వో స్ఫూర్తి.. నీతోనే కీర్తి..!
By మధుసూదనరావు రామదుర్గం Published on 21 Aug 2020 6:34 AM GMTఅంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు మహేంద్ర సింగ్ ధోనీ ప్రకటించిన దరిమిలా దేశవ్యాప్తంగా చాలామంది క్రికెట్ అభిమానులు కలత చెందారు. చాలా మంది ఇదో నిర్దయ నిర్ణయం అని వాపోయారు. ధోనీ లేని క్రికెట్ చిన్నబోతుందని సోషల్ మీడియా వేదికగా తమ భావోద్వేగాలను పంచుకున్నారు. భారత్ క్రికెట్‌ను ప్రపంచ పటంలో సమున్నతంగా నిలిపిన కేప్టెన్లలో ధోనీ పేరు చిరస్థాయిగా నిలిచి పోతుంది. ఈ నేపథ్యంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ధోనీకి ప్రశంసాపూర్వక లేఖ రాసి నెటిజన్లనే కాదు సమస్త క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచారు. ప్రతి విషయానికి చురుకుగా స్పందించే ప్రధాని ధోనీ రిటైర్ విషయంలోనూ అలాగే స్పందించారు. ధోనీకి ప్రత్యేకంగా ఉత్తరం రాశారు. చిన్న పట్టణం నుంచి క్రికెట్ రంగంలోకి వచ్చి ధ్రువతారలా వెలుగులు విరజిమ్ముతున్న ధోనీ తీరును కొనియాడారు. ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ధోనీ ఆ అపురూప ఉత్తరాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఆ లేఖ ఇలా సాగింది..
ధోనీ ఆగస్టు 15న మీరు విడుదల చేసిన ఓ చిన్న వీడియో ప్రపంచంలో సంచలనం రేపింది. మన దేశంలో ఓ చర్చనీయాంశంగా మారింది. మీ రిటైర్‌మెంట్ నిర్ణయానికి కోట్లాది భారతీయులు నిరాశ చెందినా, దశాబ్దం పైచిలుకు మీరు క్రికెటర్‌గా, టీమ్ కేప్టెన్‌గా అందించిన సేవలకు నిరంతరం ప్రశంసిస్తునే ఉంటారు. ప్రపంచ స్థాయిలో భారత్ క్రికెట్‌ను తీసుకెళ్ళిన ఉత్తమ సారథులు మీరు. మీ నాయకత్వంలో భారత్ కీర్తి పతాకం రెపరెపలాడింది. బ్యాటింగ్‌లోనూ, వికెట్‌కీపింగ్‌లోనూ, నాయకత్వంలోనూ ఇలా పలు విభాగాల్లో మీకు మీరే సాటి అనిపించుకున్నారు. చాలా మ్యాచ్‌లలో ట్రబుల్ షూటర్‌గా నిలిచారు. 2011 ప్రపంచకప్ ఫైనల్‌లో మీరు ఆడిన తీరు ఇప్పటికీ యువత ఓ పెద్ద ముచ్చటగా చెప్పుకుంటోంది. మీరు సాధించిన స్కోర్లు, విజయాలతోనే మిమ్మల్ని చూస్తే అది అన్యాయమే అవుతుంది. కేవలం క్రికెటర్‌గా కాకుండా మీలో ఓ గొప్ప మానవతావాది ఉన్నాడు.
చిన్న పట్టణంలో ఓ సామాన్య కుటుంబంలోంచి వచ్చిన మీరు చాలా త్వరగా తారే జమీన్‌మేలా మెరిసి పోయారు. ప్రతిభను ఎవరూ అడ్డుకోలేరు అనడానికి మీరే సజీవోదాహరణ. మీ ఎదుగుదల, మీ నడత భారత్ యువతకు సదా ప్రేరణాత్మకాలే. ప్రతిభాత్మక యువత కుటుంబ నేపథ్యంతో పనిలేకుండా నైపుణ్యం ఆధారంగానే అవకాశాలను అందిపుచ్చుకుంటారనడానికి మీరే స్ఫూర్తి. ఎక్కడ్నుంచి వచ్చామన్నది కాదు.. ఎలా వచ్చాము.. ఎలా ఎదిగాము అన్నదే ప్రధానమని మిమ్మల్ని చూసిన యువత తప్పకుండా తెలుసుకుంటుంది. ఆ వెలుగులోనే తమ భవితవ్యాన్ని తీర్చి దిద్దుకుంటుంది.
సాధారణంగా మన భారతీయులు ఎలాంటి అసాధారణ పరిస్థితులున్నా సాహసించడానికి వెనకాడరు. ఎంత ఒత్తిడి ఉన్నా దాన్ని చిత్తు చేయగల చిత్త స్థైర్యం భారత యువత సొంతం. ఎలాంటి దిక్కు లేకుండా అనామకంగా నిలిచిన కోట్లాది యువతలో మీరు నింపిన చైతన్యం అసామాన్యం. ధోనీ క్రికెట్ జీవితాన్ని చూసిన ఏ యువకుడైనా.. యువతి అయినా ఉన్నత శిఖరాల లక్ష్యాన్ని నిర్ణయించుకోవడంలో సచేతనంగా ఆలోచిస్తారన్నది ముమ్మాటికీ సత్యం. ప్రధానంగా మీ సారథ్యంలో జట్టు నిశ్చింతగా మరో ఆలోచన లేకుండా ఆటపైనే దృష్టి కేంద్రీకరించగలుగుతుంది. ఆట ఎలా ఉన్నా.. ఎలాంటి మలుపు తిరిగినా.. మీ ఆలోచనలు మాత్రం స్థిర కక్ష్యలోనే పరిభ్రమిస్తుంటాయి. ఈ మానసిక నిర్మాణం.. ఇలాంటి వ్యక్తిత్వం యువతకు చాలా అవసరం. ఇదే సందర్భంగా భారత్ సైన్యంతో మీ అనుబంధం గురించి కూడా మాట్లాడుకోవాలి. సైన్యంలో ఉన్నందుకు మీరు సదా గర్వించేవారు. వారి సంక్షేమాన్ని సదా కాంక్షించారు. మీ నిర్ణయం కాస్త ఆందోళన కలిగించే అంశమే అయినా సంతోషించదగ్గ విషయమేంటంటే.. ఇకపై మీ కుటుంబంతో మీరు ఎక్కువ సమయం గడిపే వీలుకుదురుతుంది. అది మీ కుటుంబ సభ్యులకు ఆనందం కలిగించేదే కదా! ఈ సందర్భంగా వారికీ శుభాకాంక్షలు తెలపాలి. ఎందుకంటే వారి సహకారం లేనిదే మీ చరిత్ర ఇంత శోభాయమానంగా ఉండేది కాదేమో! మీరు సాధించిన పలు గొప్ప విజయాల్లో వారి పాత్ర కూడా గణనీయం, స్మరణీయం. చివరిగా.. ఓ టోర్నీలో విజయం సాధించినందుకు అందరూ సంబరాలు చేసుకుంటుంటే మీరు మీ ముద్దుల కూతురుతో ఆడుకుంటున్న దృశ్యం ఇప్పటికీ నా కళ్ళలో కదలాడుతునే ఉంది. వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితానికి స్పష్టమైన రేఖ గీసుకోవడం మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి. మీ భవిష్యత్తు జీవితం మరింత శుభప్రదంగా, సుఖశాంతులతో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా!
ప్రధాని రాసిన ఈ లేఖను పరిశీలిస్తే మోదీగారు వ్యక్తిగత జీవితానికి యువత ప్రాధాన్యమివ్వాలని పరోక్షంగా సూచించినట్లు అనిపిస్తుంది. అలాగే ఓ గొప్ప వ్యక్తి వృత్తి జీవితం నుంచి నిష్క్రమించడం సాదాసీదాగా ఉండరాదన్న భావన కూడా కనిపిస్తోంది. ఏ వ్యక్తికి తన విజయాలను తనే చెప్పుకుంటే వచ్చే ఆనందం కన్నా ఇతరులు గుర్తించినపుడు కలిగే హర్షం వేయిరెట్లు ఎక్కువగా ఉంటుంది. అందులోనూ దేశప్రధాని స్వయంగా అభమానంతో రాసిన ఉత్తరం నిరంతరం స్ఫూర్తిదాయకంగానే కాదు ప్రేరణాత్మకంగానూ ఉంటుంది. పేద ధనికాతీతంగా ఎవరు జీవితంలో విజయం సాధించినా అది విజయమే అని ప్రధాని గుర్తించడం నిజంగా అభినందనీయం.. ఎందరికో మార్గదర్శకం!!