ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకుంటాం : ప‌్ర‌ధాని మోదీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  26 April 2020 7:10 AM GMT
ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకుంటాం : ప‌్ర‌ధాని మోదీ

క‌రోనా పై పోరులో ప్ర‌తి భార‌తీయుడు సైనికుడేన‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు ఆయ‌న 'మ‌న్ కీ బాత్' కార్య‌క్ర‌మంలో దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు.

క‌రోనా పై పోరులో ప్ర‌పంచ దేశాల‌కు భార‌త పౌరులు స్ఫూర్తిగా నిలుస్తున్నార‌ని అన్నారు. ఇలాంటి క‌ష్ట కాలంలో ఎంతో మంది పేద‌ల‌కు అండ‌గా నిలుస్తూ సాయం చేస్తున్నార‌ని, ఎవ‌రు కూడా ఆక‌లితో అల‌మ‌టించ‌కుండా ఉండేందుకు రైతులు శ్ర‌మిస్తున్న‌ట్లు చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రూ వారి వారి సామ‌ర్థ్యానికి త‌గిన‌ట్లు పోరాడుతున్నార‌న్నారు. ఢిల్లీ నుంచి దేశంలోని ప్రతి గల్లీ వరకు ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ పాటిస్తున్నారన్నారు.

క‌రోనాతో ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకుంటామ‌ని, రోజు వారీ ఆదాయంతో బ‌త్రికే ఆటో డ్రైవ‌ర్లు, కూలీల ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారిందన్నారు. డాక్ట‌ర్లు, పారిశుద్య సిబ్బంది, పోలీసులు నిరంత‌రం శ్ర‌మిస్తున్నార‌ని తెలిపారు. ఒక‌ప్పుడు మాస్క్ వేసుకుంటే రోగిగా చూసేవార‌ని, ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్ ధ‌రించాల్సి వ‌స్తోంద‌న్నారు.

ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమానికి ప్రజలు బాసటగా నిలిచారని, స్వచ్ఛ భారత్, మరుగుదొడ్ల నిర్మాణాల్లోనూ ప్రజలు స్పందించారని, ఇప్పుడు కరోనా సృష్టించిన విలయాన్ని అధిగమించేందుకు అన్ని వర్గాల ప్రజలు కొత్త తరహా విధానాల వైపు మళ్లారని మోదీ ప్రశంసించారు.

Next Story