రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ సమావేశం.. ఎందుకంటే
By సుభాష్
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో మర్కజ్ భవన్‌లోని తబ్లిగీ జమాతే కార్యక్రమానికి హాజరైన వారి కారణంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య అమాంతంగా పెరిగిపోయాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తం అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలతో పాటు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఈ కార్యక్రమానికి హాజరు కావడంపై కరోనా వైరస్ మరింత విజృంభించింది. గడిచిన 24 గంటల్లోనే వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన వారిలో 138 మందికిపైగా కరోనా సోకినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2న దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వివిధ రాష్ట్రాల్లో నమోదైన కరోనా కేసులు, మరణాల సంఖ్య, కరోనా నివారణకు ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై మోదీ చర్చించనున్నారు.
ముఖ్యంగా మర్కజ్ నిజాముద్దీన్ సమావేశంలో పాల్గొన్నవారు ఏఏ రాష్ట్రాల్లో ఉన్నారు. ఏఏ జిల్లాలో ఎంత మంది ఉన్నారు. అందులో ఎంత మందికి కరోనా పాజిటివ్ వచ్చింది..వారిపై అబ్జర్వేషన్ ఎలా ఉంది అనే తదితర అంశాలపై మోదీ చర్చించనున్నారు. మరో వైపు లాక్‌డౌన్ అమలుపై కూడా చర్చించనున్నారు. లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని అనే దానిపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.