చెత్తశుద్ధిపై వివేక్ చిత్తశుద్ధి..!.. పూణేలో స్వచ్ఛోద్యమం
By మధుసూదనరావు రామదుర్గం Published on 29 Aug 2020 1:16 PM ISTఏంటో ఈ మనుషులు చెత్తంతా పడేస్తుంటారు. కొద్దిగా కూడా సివిక్‌సెన్స్ ఉండదు. ఊరంతా చెత్తదిబ్బలా మార్చేస్తున్నారు...మరి రోగాలు రావా అంటే రావా మరి! అంటూ ఈసడించుకునే వారు లెక్కకు మిక్కిలిగా ఉంటున్నారు. అయితే అదే చెత్తపని తాము చేస్తున్నప్పుడు మాత్రం గమ్మునుంటారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయరాదు అని తెలుసు...పరిసరాలు శుభ్రంగా ఉండాలనీ తెలుసు...మరి ఎందుకు దాన్ని ఆచరణలోకి తీసుకురాలేకపోతుంటారంటే...మాటలకే పరిమితం కావడం వల్ల! అందుకే మనం సమస్య పరిష్కారంలో భాగస్వాములైతేనే ఫలితముంటుందంటాడు వివేక్ గౌరవ్. 24 ఏళ్ళ ఈ కుర్రాడు ప్లాస్టిక్ రహిత ప్రపంచం కోసం కలలు కంటున్నాడు. ఆ కలలను నిజం చేయడానికి నిరంతరం శ్రమిస్తున్నాడు. సముద్రమంత ఆలోచనల కన్నా బిందువంత ఆచరణ మేలని తన ఆచరణాత్మక కార్యక్రమాల ద్వారా నిరూపిస్తున్నాడు.
పూణే వాసి... సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేతినిండా జీతం సంపాదిస్తున్న వివేక్ గౌరవ్ తన నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చడానికి శ్రమిస్తున్నాడు. అందుకోసం ప్రతి వారాంతం ప్లాగింగ్ నిర్వహి స్తున్నాడు. (పికప్ అండ్ జాగింగ్ అదే ప్లాగింగ్) తనలాగే ప్లాస్టిక్‌పై పోరాడే కొందరు ప్లాగర్‌లను కలుపుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. ఈ సంవత్సరం జనవరిలో వివేక్ 520 మంది ప్లాగర్‌లతో ప్లాగింగ్ చేపట్టి పూణేలో దాదాపు 38 వేల కేజీల చెత్తను సేకరించగలిగాడు. అంతేకాదు ఈ బృందం ముతా నది ఒడ్డును దత్తత తీసుకుని చెత్తలేకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తోంది. కేవలం చెత్తనే కాదు బయోమెడికల్ వ్యర్థాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు. వివేక్ గౌరవ్ లాగే మరో 21 ఏళ్ళ యువకుడు, పర్యావరణ ప్రేమికుడు మల్హర్ కాలంబే ముంబైవాసుల్లో ప్రేరణ తీసుకురాగలిగాడు. తను బీచ్ ప్లీజ్ కార్యక్రమం ద్వారా ఏకంగా 360 టన్నుల చెత్తను దాదర్ బీచ్ నుంచి సేకరించాడు.
వివేక్ గౌరవ్ 2019లో చెత్తపై ప్రజల్లో స్పృహ కల్పించే చైతన్య కార్యక్రమాన్ని ప్రారంభించాడు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో గౌరవ్ అతని స్నేహ బృందం నాలుగు వారాంతాలు ఏకధాటిగా చెత్త సేకరణ కార్యక్రమాలను నిర్వహించారు. వివేక్ గౌరవ్ అతని స్నేహితులు అక్టోబర్ 2న అంటే గాంధీ జయంతి రోజున తమ ఆలోచనలను ఆచరణాత్మకంగా అమలు చేయడం ప్రారంభించారు. ఈ బృందాన్ని వివేక్ ముచ్చటగా పర్యావరణ పోరాట యోధుల బృందంగా పిలిచేవారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో వివేక్‌గౌరవ్ తన స్నేహితులు,కొలీగ్స్, వలంటీర్లతో కలిసి 30 రోజుల ప్లాగింగ్ నిర్వహించాడు. పరిసరాల పరిశుభ్రతతోపాటు వ్యక్తిగత ఫిట్‌నెస్‌కూడా కార్యక్రమంలో భాగాలని వివేక్ తరచూ తెలిపేవాడు.
‘ప్రతి రోజూ ఉదయం 6 గంటలకే ప్లాగింగ్ మొదలయ్యేది. మొదట డిగీ హిల్స్, హింజెవాడీ వాకాడ్ ఏరియా, ఐటీ ఏరియాల్లో ఈ ప్లాగింగ్ చేసేవారు. శివంగినగర్, కొట్లార్ ప్రాంతాల్లో కూడా ప్లాగింగ్ చేసేవారు. క్రమంగా నగరంలో పలు ప్రాంతాల ప్రజలు తమ ఏరియాలో కూడా ప్లాగింగ్ చేయాల్సిందిగా విన్నవించ సాగారు. ఈ క్రమంలోనే పూణేను చైతన్యవంతం చేసేందుకు 20 నుంచి 30 సర్కారు బడుల పిల్లల్ని ఈ ప్లాగింగ్‌లో చేర్చుకున్నాము’ అని వివేక్‌గౌరవ్ ఉత్సాహంగా చెబుతారు.
పూణేలో వివేక్ ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న విద్యార్థులకు వివిధ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చేవాడు. అలంది లోని ఓ సర్కారు బడిని దత్తత తీసుకుని స్మార్ట్ స్కూల్ ఇనిషియేషన్, విద్య, ఆరోగ్యం,న్యూరోబిక్స్, యోగా,ధ్యానం తదితర అంశాలపై వారికి అవగాహన కల్పించాడు. వివేక్ గౌరవ్ తన స్నేíßతులతో చేపడుతున్న కార్యక్రమాలను పుణే మునిసిపల్ కార్పొరేషన్ మెచ్చుకుంది. గత సంవత్సరం డిసెంబర్‌లో మెగా ప్లాగథాన్–2020 కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేసింది. ఈ ప్లాగథాన్‌లో లక్షలాది మంది పాల్గొని గంటలో 19వేల కేజీల చెత్తను సేకరించగలిగారు.
వివేక్ గౌరవ్ అతని స్నేహబృందం చేపడుతున్న ఈ ప్లాగింగ్ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్‌లో ప్రశంసించారు. గత నాలుగైదేళ్లుగా గౌరవ్ అతని మిత్రబృందం ఇంద్రాణి నదిని నిరంతరం శుభ్రపరుస్తున్నారు. ఇంద్రాణి నది పరమ పవిత్రమైనదిగా ప్రజలు పూజిస్తుంటారు. నిత్యం భక్తిస్నానాలు ఆచరిస్తుంటారు. దేవుళ్ళ విగ్రహాల నిమజ్జనం చేస్తుంటారు. ఈ కార్యక్రమాల వల్ల ఇంద్రాణి నది కాలుష్య కాసారంలా మారిపోయింది. ఈ నదికి పూర్వ వైభవం తీసుకురావడానికి వివేక్ గౌరవ్ అతని స్నేహితులు నిరంతరం శ్రమిస్తున్నారు.
పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నా వివేక్‌కు రెక్స్ కర్మవీర్ చక్ర అవార్డు 2019లో లభించంది. అదే సంవత్సరంలో ఇండియన్ యూత్ అవార్డు సాధించారు. ‘వ్యర్థాలను సేకరించే పనికే పరిమితం కాకుండా వాటిని ప్రాసెస్, రీసైక్లింగ్ చేయడం ద్వారా మళ్ళీ ఉపయోగించుకునే కార్యక్రమం కూడా చేస్తున్నామని వివేక్ తెలిపారు. వివేక్ ప్లాగింగ్ ప్రారంభించినప్పడు అదో చిన్న కార్యక్రమం మాత్రమే. కానీ ఇప్పుడు అది బాగా విస్తరించింది. పూణేలో ప్రతి ఒక్కరికీ ఈ ప్లాగింగ్ అంటే ఏంటో తెలుసు. మున్ముందు ఇది ఉద్యమస్థాయికి వెళుతుంది.
ఎంతటి సుదూర ప్రయాణమైనా ఒక అడుగుతోనే మొదలవుతుంది అన్న వాక్యంపై వివేక్‌కు గొప్ప నమ్మకం అందుకే తన స్వచ్ఛతా కార్యక్రమాన్ని ఉద్యమ దిశగా తీసుకెళుతున్నాడు.