కరోనా అదుపు కష్టం కాదు..!

By మధుసూదనరావు రామదుర్గం  Published on  29 Aug 2020 5:46 AM GMT
కరోనా అదుపు కష్టం కాదు..!

కరోనా విజృంభణతో దేశప్రజలు అల్లాడిపోతున్నారు. నెలలు గడుస్తున్న కొద్దీ కేసులు అంతకంతకూ పెరగడమే కానీ తగ్గుముఖం పడుతున్న దాఖలాల్లేవు. తెలంగాణలో గురువారం 2,932 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 10వేల పైచిలుకు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సెప్టెంబరు 1 నుంచి అన్‌లాక్‌ నాలుగోదశలో చాలా వాటిని సడలిస్తారన్న నేపథ్యంలో కరోనా మరింత వేగంగా వ్యాపిస్తుందేమోనని ప్రజలు హడలి పోతున్నారు.

ఇదంతా ఒక పార్శ్వం. కానీ స్వీయ నియంత్రణ, వైద్యుల సంప్రదింపుల ద్వారా కరోనాను కచ్చితంగా నియంత్రించుకోవచ్చని వైద్యులంటున్నారు. గతంలోని స్వైన్‌ఫ్లూతో పోలిస్తే కరోనా అంత ప్రమాదకరమేం కాదనే అంటున్నారు. 1918 నుంచి 21 వరకు స్వైన్‌ఫ్లూ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 కోట్లమంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. దాంతో పోలిస్తే కరోనా వైరస్‌ పట్ల ప్రజలకు చాలా స్వల్ప వ్యవధిలోనే అవగాహన వచ్చిందనే చెప్పవచ్చు. ఎలక్ట్రానిక్, ప్రింట్, డిజిటల్‌ మీడియాల వల్ల కూడా ప్రయోజనం చేకూరుతోంది. నగరం మొదలు పట్టణం, పల్లెల దాకా ప్రతి ఒక్కరికి రోజూ కరోనా తీవ్రత ఎంతుందో తెలుసుకునే వెసులు బాటు దొరికింది. పైగా పాజిటివ్‌ వచ్చిన వారందరూ మరణిస్తారనే అపోహ కూడా తొలిగింది. కారణం రికవరీ శాతం పెరగడమే.

కరోనా మహమ్మారి నుంచి మనల్ని మనమే కాపాడుకునే అవకాశాలున్నాయి. అయితే వాట్సప్, ఫేస్‌బుక్‌ తదితర మాధ్యమాల్లో కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న ఇంటి వైద్యం, చిట్కాల జోలికి మాత్రం వెళ్ళకుండటమే మంచిది. ఏది చేసినా వైద్యుల పర్యవేక్షణలోనే సాగాలి అన్న విషయాన్ని విస్మరించరాదు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో అవసరానికి మించిన హడావుడి చేసేసి రోగిని భయపెట్టి ఎక్కువ మోతాదులో అనవసరమైన మందులు కూడా ఇస్తున్నారు. దీని వల్ల ప్రయోజనం మాటెలా ఉన్నా బాధితులకు దీర్ఘకాల నష్టం వాటిల్లే ప్రమాదముందని నిపుణులు అంటున్నారు. వైద్యమే కాదు వైద్యుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. కొందరు అనుభవం లేని వైద్యులు కూడా తోచిన చికిత్స చేస్తున్నారు. అలాగే కొన్ని ఆస్పత్రుల్లో డాక్టర్లు విపరీతంగా యాంటిబయాటిక్స్‌ ఇస్తున్నారు. ఇది సరికాదని అనుభవజ్ఞులు చెబుతున్నారు.

కరోనా సోకిందని కొందరు తీవ్రంగా ఆందోళన చెందితే మరి కొందరు చివరి నిమిషం దాకా గుట్టు చేస్తూ తలకు తెచ్చుకుంటున్నారు. వాస్తవానికి ఈ రెండు విధానాలు సరైనవి కావు. కరోనా వస్తే చాలు వారిని వెలివేసినంత పని చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో . మొదట్లో ఈ జాడ్యం విపరీతంగా ఉన్నా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న కొద్దీ ప్రజల ఆలోచనల్లోనూ మార్పులొస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇది ప్రాణాంతక వైరస్‌ కాదని గుర్తించడం. వాస్తవానికి ఏ వ్యాధి అయినా సోకిన వెంటనే చికిత్స చేయించుకుంటే అదుపులోనే ఉంటుంది. దాన్ని పట్టించుకోకపోతేనే ఇబ్బంది. కరోనా సోకి రికవరీ అయిన చాలా మంది అనుభవం చెబుతున్న మాట ఏంటంటే...అన్నిటికి మించి కరోనా వచ్చిందన్న ఆందోళన సరికాదు. పక్కింటి వాళ్ళకో... ఎదురింటి వాళ్ళకో వచ్చిందని కూడా విపరీతంగా భయపడేవారు లేకపోలేదు. నగరంలోనే అద్దెకున్న వారికి కరోనా వచ్చిందని ఇంటి యజమాని ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడింది. ఇలాంటి ధోరణులు ఎంత తగ్గితే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు.

కరోనా సోకిన వారికి ప్రత్యేకమైన డయట్‌ అంటూ ఏమీ ఉండదని కొందరు వైద్యులంటున్నారు. వారు సమయానికి ఆహారం, కంటినిండా నిద్ర, వేళకు తగిన వ్యాయామం చేస్తే చాలంటున్నారు. ఈ మూడు సరిగా పాటిస్తే నిరోధక శక్తి పెరిగే వీలుంది. అలాగే మృతదేహాలనుంచి వైరస్‌ సోకుతుందని చెప్పలేమం టున్నారు. మనిషి ఊపిరి తీసుకుని వదలడం ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. అయితే మరణించిన వారు ఈ రెండు ప్రక్రియలు చేయలేరు కాబట్టి...అంతగా భయపడాల్సిన అవసరం లేదు. పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియల్లో పాల్గొనవచ్చని సూచిస్తున్నారు.

తుమ్మితేనే తంటా..: కరోనా నియంత్రణలో భౌతిక దూరం చాలా ప్రధానం. కనీసం ఆరు అడుగుల దూరం పాటించాలని ఇప్పటి దాకా అనుకున్నాం. అయితే కొన్ని సందర్భాల్లో ఆ దూరం కూడా సరిపోదని ఆక్స్‌పర్డ్, మసాచుసెట్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన శాస్త్రజ్ఞులు అంటున్నారు. కరోనా సోకిన వ్యక్తి మాట్లాడితే నోటి నుంచి వచ్చే తుంపర్లు కన్నా తుమ్మితే వచ్చే తుంపర్ల వ్యాప్తి చాలా ఎక్కువని వారి పరిశోధనలో తేలింది. కరోనా వచ్చిన వ్యక్తి తుమ్మితే కంటికి కనిపించని ఆ తుంపర్లు శరవేగంతో రమారమి 26 అడుగుల దూరం దాకా వ్యాపిస్తుందని అంటున్నారు. అలాగే కరోనా ముప్పు మహిళల్లో తక్కువ అని కూడా తెలుస్తోంది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్త కరోనా లెక్కల్ని గమనిస్తే ఇదే మనకు తెలుస్తోంది. మహిళల్లో ఈస్ట్రోజెన్‌ హార్మోన్ల వల్ల వైరస్‌ సోకే ప్రమాదం తక్కువని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. సాధారణంగా కరోనా వైరస్‌ గుండెపై దాడి చేస్తుంది. కానీ మహిళల్లో ఈస్ట్రోజెన్‌ హార్మోన్ల వల్ల ఈ ముప్పు తప్పుతుందని శాస్త్రజ్ఞుల పరిశీలన.

కాగా దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు ఒక్క శుక్రవారం నాడే 77 వేలదాకా ఉంది. దీంతో మొత్తం కేసులు 39,87,500కు చేరుకుంది.

- రామదుర్గం మధుసూదనరావు

Next Story