పరిపాలన వికేంద్రీకరణ బిల్లు.. మండలిలో ఆమోదం పొందినట్లే.!
By అంజి
ముఖ్యాంశాలు
- సెలెక్ట్ కమిటీల ఏర్పాటు ఇంకా పూర్తి కాలేదు
- మండలి చైర్మన్ నిబంధనలను అనుసరించలేదు
- మండలిలో మూడు ప్రత్యామ్నాయాలే..
అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు తమ దృష్టిలో శాసనమండలిలో ఆమోదం పొందినట్లేనని మండలిలో అధికారపక్ష నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. రెండు వారాలు గడిచిన పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై సెలక్ట్ కమిటీల ఏర్పాటు పూర్తి కాలేదని పిల్లి సుభాష్ అన్నారు. సచివాలయంలో పిల్లి సుభాష్ మాట్లాడుతూ.. ఇక సెలెక్ట్ కమిటీకి చెల్లు చీటి పడినట్లేనన్నారు. శాసనసభలో ఆమోదం పొందిన బిల్లులను శాసనమండలిలో ఆమోదం తెలపడం, తిరస్కరించడం లేదా సెలెక్ట్ కమిటీ పంపే అవకాశాలు మాత్రమే ఉంటాయని సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు.
గత నెల 22న బిల్లులను మండలిలో ప్రవేశ పెట్టిన తర్వాత జరిగిన పరిణామాల ఆధారంగా, బిల్లులను నిబంధనల ప్రకారం సెలెక్ట్ కమిటీకి పంపే పరిస్థితి లేదని పిల్లి సుభాష్ అన్నారు. బిల్లులను మండలి తిరస్కరించలేదని.. ఈ క్రమంలో బిల్లులకు ఆమోదం లభించినట్టేనన్నారు. తదుపరి చర్యగా ఈ బిల్లులను గవర్నర్‌కు పంపే విషయాన్ని అసెంబ్లీ అధికారులు చూసుకుంటారని అన్నారు.
సెలెక్ట్ కమిటీ ఏర్పాటు విషయంలో మండలి చైర్మన్ ఏ ఒక్క నిబంధననుఉ అనుసరించలేదని ఉమ్మారెడ్డి, సుభాష్ చంద్రబోస్ అన్నారు. సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపాలంటే 5(9) (5) నిబంధన ప్రకారం అభ్యంతరం వ్యక్తం చేయాలని, కానీ ఈ రెండు బిల్లులో విషయంలో అది జరగలేదని వారు పేర్కొన్నారు. నిర్ణయం వెల్లడించే సమయంలో తప్పులు జరిగాయని మండలి చైర్మన్ ఒప్పుకున్నారని అన్నారు. అయినా చైర్మన్ విచక్షణాధికారంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదని చెప్పారు. అసెంబ్లీ కార్యదర్శిని టీడీపీ నేతలు బెదిరించారని ఉమ్మారెడ్డి, సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు.