వరుసగా ఆరో రోజు బాదుడు.. లీటరు వంద చేస్తారా ఏంటి?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Jun 2020 12:16 PM GMT
వరుసగా ఆరో రోజు బాదుడు.. లీటరు వంద చేస్తారా ఏంటి?

ప్రపంచమంతా ఒకలా ఉంటే.. మనం మాత్రం మరోలా ఉండటం మోడీ సర్కారు స్పెషాలిటీనా? అన్నదిప్పుడు చర్చగా మారింది. ఓవైపు వణికిస్తున్న మహమ్మారితో వ్యవస్థలన్ని భారీగా దెబ్బ తిన్న వేళ.. ప్రపంచ మార్కెట్లకు భిన్నంగా పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచేస్తున్న చమురుసంస్థల నిర్ణయం వెనుకున్నకేంద్రం ఆలోచన ఏమిటన్నది ప్రశ్నగా మారింది. గడిచిన ఆరు రోజులుగా వరుస పెట్టి.. పెట్రోల్.. డీజిల్ ధరలు పెరుగుతున్నాయి.

బహిరంగ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధరలు పడిపోయిన నేపథ్యంలో లీటరు పెట్రోల్.. డీజిల్ మీద వసూలు చేస్తున్న మొత్తం భారీగా ఉందన్న విమర్శలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ మధ్యన ముడి చమురు ధరలు కాస్త పెరుగుతున్నాయి. కానీ.. అందుకు భిన్నంగా పెరుగుతున్న పెట్రోల్.. డీజిల్ ధరలు షాకిస్తున్నాయి.

అంతకంతకూ పెరుగుతున్న ధరలతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. పెట్రోల్.. డీజిల్ ధరల్ని పెంచటం.. తగ్గించటం మొత్తం కేంద్రం కనుసన్నల్లో ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆ మధ్యన ఎక్సైజ్ డ్యూటీని పెంచేయటం ద్వారా ఏకంగా రూ.2లక్షల కోట్ల ఆదాయం కేంద్రం ఖాతాలో పడినట్లుగా విశ్లేషకులు చెబుతుంటారు. ఇది సరిపోదన్నట్లుగా ఇటీవల రోజుకు నలబై పైసలు నుంచి అరవై పైసల మధ్యలో ధరను పెంచేస్తూ నిర్ణయం తీసుకుంటున్నాయి.

వరుస పెట్టి పెంచేస్తున్న ధరలకు తోడుగా ఈ రోజు (శుక్రవారం) కూడా పెట్రోల్ మీద లీటరుకు 57 పైసలు.. డీజిల్ మీద 59 పైసలు పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గడిచిన ఆరు రోజుల వ్యవధిలో పెట్రోల్ మీద రూ.3.31 డీజిల్ మీద లీటరుకు రూ.3.42 చొప్పున పెరిగాయి. ఇదే తీరులో పెరుగుతూ పోతే సెప్టెంబరు చివరకు లీటరు పెట్రోల్ రూ.85 వరకు వెళుతుందని చెబుతున్నారు. ఈ బాదుడు ఈ ఏడాది చివర వరకూ సాగితే.. లీటరు రూ.100 టచ్ అయినా ఆయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. చూస్తుంటే.. లీటరు పెట్రోల్.. డీజిల్ వంద చేయటమే మోడీ సర్కారు లక్ష్యమా అని పలువురు మండిపడుతున్నారు. మరీ మంట మోడీ మాష్టారికి ఎప్పటికి తాకుతుందో.?

Also Read

Next Story