సుందిళ్లలో చేపల పండగ.. ఫ్రీగా చేపలు పట్టుకెళ్తున్నారు
By తోట వంశీ కుమార్ Published on 29 Aug 2020 10:51 AM GMTమంచిర్యాల- పెద్దపల్లి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న సుందిళ్ల పార్వతి బ్యారేజీ వద్ద వద్ద చేపల పండగ కొనసాగుతోంది. జనం మరోసారి చేపల కోసం ఎగబడ్డారు. బ్యారేజీ గేట్లు మూసివేయడంతో రెండు జిల్లాలలోని వందల మంది.. ఆటోలు, ట్రాక్టర్లు, కార్లు, బైక్‌లు.. ఇలా ఏ వాహనం దొరికితే అది పట్టుకుని పార్వతీ బ్యారేజీ దగ్గరకు చేరుకుంటున్నారు. నీటి గుంతల్లో ఉన్న చేపల్లో ఉన్న చేపలను పట్టుకునేందుకు పోటి పడ్డారు. కరోనా అన్న సంగతే మరిచారు. వందల సంఖ్యలో ప్రజలు బ్యారేజీ దగ్గరకు రావడంతో అక్కడ దృశ్యం జనజాతరను తలపిస్తోంది. ఐదు రోజుల క్రితంతో పోల్చిచూస్తే చేపలు తక్కువగానే ఉన్నాయి. దీంతో వలలు వేసిన వారికి మాత్రమే చేపలు చిక్కుతున్నాయి. ఈ క్రమంలొ చేపలను సులువుగా పట్టుకోవచ్చు అని తరలివచ్చిన వారికి నిరాళే ఎదురవుతోంది. పోలీసులు సామాజిక దూరం పాటించాలి. అక్కడ నుండి వెళ్లిపోవాలని చెప్పినా ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఇదేదో ఇప్పుడే మొదలైంది కాదు. వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకు బ్యారేజ్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో బ్యారేజ్ గేట్లు ఎత్తి వేసి కిందకు నీటిని వదిలారు. వరద తగ్గిన తర్వాత మూసివేశారు. ఈ క్రమంలో కొట్టుకు వచ్చిన టన్నుల కొద్ది చేపల కోసం జనం ఎగబడ్డారు. తమ కుటుంబ సభ్యులతో పాటు అక్కడి వచ్చి ఫ్రీగా చేపలు పట్టుకెళ్తున్నారు. చేతికి దొరికిన చేపను పట్టుకుని సంచీలో వేసుకుంటున్నారు. అసలు ఎవ్వరిలో కరోనా భయమే కన్పించడం లేదు. అందులో ఒక్కరికి కరోనా ఉన్నా.. అందరికీ సోకే అవకాశాలు ఉన్నాయి.