క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మే 17 వ‌ర‌కు పొడిగించ‌గా.. కొన్ని స‌డ‌లింపుల‌ను కేంద్రం ఇచ్చింది. దీంతో దాదాపు 40 రోజుల త‌రువాత మ‌ద్యం దుకాణాలు తెర‌చుకున్నాయి. దాదాపు నెల‌న్న‌ర రోజులు మ‌ద్యం లేక మందు బాబులు విల‌విల‌లాడిపోయారు. ఇలా దుకాణాలు తెరిచారో లేదో అలా వాటి ముందు చాంతాడంత క్యూలు క‌ట్టారు. భౌతిక దూరాన్ని ప‌క్క‌నెట్టారు. క‌నీసం మాస్కుల‌ను కూడా ధ‌రించ‌డం లేదు.

ఇక కరోనా మ‌హ‌మ్మారి భ‌యంతో కొన్ని చోట్ల మ‌ద్యం దుకాణాల య‌జ‌మానులు షాపుల‌ను తెరిచేందుకు ఆస‌క్తి చూప‌డం లేదట‌. షాపుల‌ను తెరిపించడంతో పాటు మందుబాబులు నిబంధ‌న‌ల‌ను పాటించేలా మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాజ‌ధాని బోపాల్‌కు 80 కిలోమీట‌ర్ల దూరంలో హోషంగాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారులు ఓ వినూత్న ఐడియాను అమ‌లు చేశారు.

మ‌ద్యం దుకాణాల వ‌ద్ద రిజిస్ట‌ర్ల‌ను ఏర్పాటు చేశామ‌ని, మ‌ద్యం కొనుగోలు దారులు త‌మ పేరు, మొబైల్ నెంబ‌ర్, త‌దిత‌ర వివ‌రాలు ఇవ్వాల్సి ఉంటుంద‌ని ఎక్సైజ్ అధికారి అభిషేక్ తివారీ తెలిపారు. అంతేకాకుండా మ‌ద్యం కొనుగోలు చేసిన వ్య‌క్తి చూపుడు వేలికి చెర‌గ‌ని ఇంకుతో ముద్ర వేస్తున్నామ‌న్నారు. భ‌విష‌త్తులో అవ‌స‌రం అయితే.. వీరిని దీని ద్వారా త్వ‌రగా గుర్తించ‌వ‌చ్చున‌ని చెప్పారు. ఈ మేర‌కు అక్క‌డి దుకాణ‌దారుల‌తో ఓ ఒప్పందానికి వ‌చ్చిన‌ట్లు తెలిపారు. ఈ నిబంధ‌న వ‌ల్ల వైన్ షాపుల వ‌ద్ద ప‌రిస్థితి అదుపులో ఉంద‌ని, మందుబాబులు ఎగ‌బ‌డ‌టం అదుపులోకి వ‌చ్చింద‌ని అధికారులు వివ‌రించారు. ఈ విధానాన్ని దేశ‌మంతా అమ‌లు చేస్తే ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని ప‌లువ‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *