మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌

By సుభాష్  Published on  2 Sep 2020 4:44 AM GMT
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌

పవర్‌ స్టార్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ జన్మదిన వేడుకల ఏర్పాట్లలో విద్యుత్‌ షాక్‌ తగిలిన ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా శాంతిపురం ఏడో మైలులో బ్యానర్లు కట్టేందుకు వెళ్లిన అభిమానులు విద్యుత్‌ షాక్‌కు గురయ్యారు. 25 అడుగుల ఎత్తున బ్యానర్‌ కడుతుండగా విద్యుత్‌ వైర్లు తగలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా, ఈ ప్రమాదంపై పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. జన సైనికుల మరణం మాటలకు అందని విషాదమని అన్నారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి తల్లిదండ్రుల గర్భశోకం అర్థం చేసుకోగలనని, వారి తల్లిదండ్రులకు దూరమైన బిడ్డలను తిరిగి తీసుకురాలేను కానీ..ఆ కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే గాయాలైన వారికి కూడా మెరుగైన వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేస్తానని అన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తానని ప్రకటించారు. ఈ మేరకు పవన్‌ కల్యాణ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

కాగా, మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మృతులు సోమశేఖర్‌, రాజేంద్ర, అరుణాచల కాగా, తీవ్ర గాయాలైన మరో ముగ్గురు హరికృష్ణ, పవన్‌, సుబ్రహ్మణ్యంలు ఉన్నారు. మృతులంతా శాంతిపురం మండలం కడపల్లికి చెందిన వారుగా గుర్తించారు.

కాగా, పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా అభిమానుల కోలాహాలం అంతా ఇంతా కాదు. ఒక రోజు ముందు నుంచి అభిమానులు వేడుకలను ఏర్పాటు చేసుకున్నారు. పవన్‌పై ఉన్న అభిమానంతో ఫ్యాన్స్‌ ఎక్కడి వారు అక్కడే పెద్ద ఎత్తున బ్యానర్లు ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. కానీ దురదృష్టవశాత్తు విద్యుత్‌ షాక్‌ ముగ్గురిని బలి తీసుకుంది. అభిమాన హీరో పుట్టిన వేడుకలని ఆనందంలో సంబరాలు జరుపుకోవాలనుకున్న అభిమానుల ఇంట విషాదం నెలకొంది. కన్నకొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబాలు కన్నీరుమున్నీరవుతున్నాయి.



Next Story