ముఖ్యాంశాలు

  • ఏపీకి రాజధాని ఎక్కడ అనేది సృష్టమైన ప్రకటన చేయాలి: పవన్‌
  • ఆడపడుచులు రోడ్ల మీదకు రావడం హృదయాన్ని కలచివేసింది: పవన్‌
  • రాజధాని రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా: పవన్‌

అమరావతి: ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడానికా 150 మందిని గెలిపించింది అంటూ వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. బలవంతంగా భూసేకరణ చేయొద్దని గతంలో టీడీపీకి చెప్పామన్నారు. అయితే ఈ రోజు అన్ని పార్టీలు కలిసి రైతులను మోసం చేస్తున్నాయని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ఎర్రబాలెంలో రైతుల ధర్నాలో పవన్‌ కల్యాణ్‌ ప్రసగించారు. అమరావతి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. హద్దులు చెరిపేసి భూములు తిరిగి ఇచ్చేస్తామంటారా అని పవన్‌ ధ్వజమెత్తారు. రైతులు పోరాటం చేసినంత కాలం జనసేన అండగా ఉంటుందని, ప్రభుత్వాలు మారినట్టు రాజధాని మార్చడం చట్టంబ్దం కాదని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గతంలో రాజధానిగా అమరావతిని సీఎం జగన్‌ ఒప్పుకున్నారని గుర్తు చేశారు. అన్యాయం చేశారు కాబట్టే రైతులకు అడుగడుగునా అడ్డు తగులుతున్నారని తెలిపారు.

రైతులను బెదిరిస్తానంటే జనసేన ఊరుకోదుని పవన్‌ పేర్కొన్నారు. ఒక రాజధానిని నిర్మించడం చాలా కష్టసాధ్యమైన పని అన్నారు. రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఏపీకి రాజధాని లేకుండా చేశారన్నారు. అడ్మినిస్ట్రేటివ్‌ కేపిటల్‌ అంటే కేవలం రెంఉ మూడు వేల ఎకరాలు సరిపోయేవి, నగర నిర్మాణం అంటే కొన్ని దశాబ్దాలు పడుతుందని పవన్‌ పేర్కొన్నారు. పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టి రాజధాని కోసం రైతులు భూములిచ్చారని, రోడ్డు మీదకు వచ్చి రైతులు చేస్తున్న ఆందోళనను ప్రతి ప్రజా ప్రతినిధి ఆలోచించాలని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రతిపక్ష నేతగా జగన్‌ ఉన్నప్పుడు రాజధానిపై సృష్టత ఇచ్చి ఉండాల్సిందన్నారు. అమరావతిపై సీఎం జగన్‌కు ఇంత కక్ష ఎందుకు అని పవన్‌ ప్రశ్నించారు. రాజధాని అమరావతి నిర్మాణంలో అవినీతి జరిగి ఉంటే దర్యాప్తు చేయించాలన్నారు. ఒకరి మీద కోపంతో రాష్ట్ర ప్రజలందరిపైనా కక్ష సాధించడమేంటని పవన్‌ ధ్వజమొత్తారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.