జూలై 10 నుంచి మళ్లీ లాక్‌డౌన్‌!

By సుభాష్  Published on  9 July 2020 8:15 AM IST
జూలై 10 నుంచి మళ్లీ లాక్‌డౌన్‌!

దేశంలో కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండగా, వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో బీహార్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని పట్నాలో ఓ వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. పట్నాలో కరోనా వైరస్‌ తీవ్రంగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గడిచిన మూడు వారాల్లో కరోనా మరింత తీవ్రతరం కావడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఈనెల 10 నుంచి 16వ తేదీ వరకు వారం రోజులపాటు లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించినట్లు జిల్లా మేజిస్ట్రేట్‌ కుమార్‌ రవి తెలిపారు. ఈ లాక్‌డౌన్‌లో షాపులు ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. కరోనా కట్టడి కోసం వారం పాటు విధించే లాక్‌డౌన్‌ మరింత కట్టడి చేయనున్నట్లు తెలిపారు.

కాగా, నిన్న దేశ వ్యాప్తంగా 22,752 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఒక్కరోజే 482 మంది మరణించారు. ఇప్పటి వరకూ దేశంలో 7,42,417 కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకూ 20,642 మంది మరణించారు. ఇక ఇప్పటి వరకూ 4,56,381 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ కాగా, 2,64, 944 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Next Story