విషాదం: వ్యాన్‌లో మంటలు.. 13 మంది సజీవదహనం
By సుభాష్ Published on 27 Sept 2020 11:02 AM IST
పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓవ్యాన్ ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో వ్యాన్‌లో ఉన్న 13 మంది సజీవదహనం అయ్యారు. మరో ఐదుగురి పరిస్థితి విషమింగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం శనివారం రాత్రి చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదం నుంచి ఏడాది వయసున్న బాలుడు మాత్రం బతికి బయటపడ్డాడు. కాగా, ప్రమాద సమయంలో వ్యాన్‌లో 20 మంది వరకు ఉన్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
హైదరాబాద్ నుంచి కరాచీ వస్తుండగా నూరియాబాద్ ప్రాంతానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. వ్యాన్ కింది భాగంలో ఉండే టై రాడ్ విరిగిపోవడం వల్లే వాహనం అదుపు తప్పి బోల్తాపడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వ్యాన్ అతివేగంగా ఉండటం, బోల్తాపడి మంటలు చెలరేగాయని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటన స్థలానికి అగ్నిమాపక శకటాన్ని రప్పించి మంటలను ఆర్పివేశారు.