కరోనా సోకితే పక్షవాతం వస్తుందా..? ఎంతవరకు అవకాశముంటుంది?

By Newsmeter.Network  Published on  12 May 2020 8:24 AM IST
కరోనా సోకితే పక్షవాతం వస్తుందా..? ఎంతవరకు అవకాశముంటుంది?

కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తూనే ఉంది. భారత్‌లో ఈ వైరస్‌ భారిన పడిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ పాజిటివ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించాయి. దీంతో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. పలు ప్రాంతాల్లో మాస్క్‌లు లేకుండా, సామాజిక దూరం పాటించకుండానే తమ పనులు నిర్వహించుకుంటున్నారు. దీంతో వ్యాధి వ్యాప్తి పెరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు కరోనా వైరస్‌ రోజురోజు తన రూపాన్ని మార్చుకుంటున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. వైరస్‌ సోకితే జ్వరం, దగ్గు ఉంటాయని అందరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం తల తిరగడం, తూలటం, చివరికి కొందరిలో పక్షవాతం కూడా వస్తుందని ప్రచారం సాగుతోంది. వైరస్‌ ఊపిరితిత్తులకే పరిమితం కాకుండా.. గుండె, జీర్ణకోశ వ్యవస్థ వంటి వాటినీ దెబ్బతీస్తోందని బయటపడింది.

Also Read :తగ్గినట్లే తగ్గి మళ్లీ కలవరపెడుతున్న కరోనా.. ఒక్క రోజే 79

తాజాగా నాడీ వ్యవస్థ పైనా దుష్ప్రభావాలు చూపుతున్నట్లు సమాచారం. వైరస్‌ భారిన పడిన మూడోవంతు మందిలో నాడులకు సంబంధించిన లక్షణాలు పొడచూపుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వ్యాధి తీవ్రంగా ఉన్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరికి వాసన, రుచి తగ్గడం, తల తిరగడం వంటి తేలికైన ఇబ్బందులకే పరిమితం అవుతుండగా.. మరికొందరిలో మెదడు వాపు, పక్షవాతం, గిలియన్‌ బారీ సిండ్రోమ్‌ వంటి ప్రమాదకర సమస్యలకూ దారితీస్తోంది. ఇందుకు మెదడుకు ఇన్‌ఫెక్షన్‌ రావటం, రోగ నిరోధక శక్తి ప్రతిస్పందనలు దోహదం చేస్తున్నాయని వైద్యులు భావిస్తున్నారు. వైరస్‌ ముక్కులో వాసనను పసిగట్టే నాడీకణాలు ఇన్‌ఫెక్షన్‌కు గురైనప్పుడు అక్కడి నుండి శ్వాసకోశ వ్యవస్థ ద్వారా మెదడుకు చేరుకోవచ్చు.

Also Read :ప్ర‌ధాన న‌గ‌రాల్లోనే క‌రోనా.. మ‌న‌ల్ని వ‌దిలిపోయేలా లేదు

కరోనా వైరస్‌ ఏసీఈ2 ప్రొటీన్‌ గ్రాహకాల ద్వారానే కణాల్లోకి ప్రవేశిస్తుంది. మెదడులోని రక్తనాళాల గోడల లోపలి పొరల కణాల్లోనూ ఏసీఈ2 ప్రొటీన్‌ గ్రాహకాలుఉంటాయి. వీటి ద్వారా వైరస్‌ మెదడులోకి వ్యాపించి ఇన్‌ఫెక్షన్‌ కలగజేయొచ్చు. దీంతో మెదడు వాపు, పక్షవాతం వంటివి సంభవించొచ్చు. మెదడు వాపు మూలంగా మూర్ఛ, మత్తుగా ఉండటం వంటి లక్షణాలు ఉండవచ్చు. కానీ ఇది అందరిలో రాదని వైద్యులు చెబుతున్నారు. కేవలం 80శాతం మందిలో కరోనా మామూళుగా తగ్గిపోతుందని, జబ్బు తీవ్రమైన వారిలో మాత్రమే ఇలాంటి లక్షణాలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. అలాగని తేలిగ్గా తీసుకోవద్దని ప్రతిఒక్కరూ చేతులు నిత్యం కడుక్కోవాలని, సామాజిక దూరం పాటించాలని, మాస్క్‌ ధరించాలని సూచిస్తున్నారు. వైరస్‌కు సంబంధించిన కొద్దిపాటి లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని, తద్వారా ఆదిలోనే వైరస్‌ను నియంత్రించడం సాధ్యమవుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

Also Read :పశువులకు వింత వ్యాధి.. కోడిగుడ్డు సైజులో బుడగలు..

Next Story