Fact Check : గుజరాత్ కు చెందిన పప్పు శుక్ల చనిపోవడంతో కుక్కలు చుట్టూ చేరి.. శవాన్ని కాపాడాయా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Nov 2020 2:15 AM GMT
Fact Check : గుజరాత్ కు చెందిన పప్పు శుక్ల చనిపోవడంతో కుక్కలు చుట్టూ చేరి.. శవాన్ని కాపాడాయా..?

ఓ వ్యక్తి చనిపోయి ఉండగా.. ఆ మృతదేహం చుట్టూ కుక్కలు చేరి ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. అతడి మృతదేహం మీదనే కుక్క బాధతో కూర్చుని ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. గుజరాత్ కు చెందిన 'పప్పు శుక్లా' అనే వ్యక్తి చనిపోవడంతో వీధి కుక్కలు ఇలా చేశాయని పోస్టుల ద్వారా చెబుతూ ఉన్నారు.



“This is a dead body of Pappu Shukla Ji, a homeless man from Gujarat State (India) who took care of abandoned dogs for many years. He died yesterday and his beloved dogs surrounded and protected his body, refusing to leave his side. May Pappu Shukla Ji Rest in Peace (sic),” అంటూ ట్వీట్ చేశారు. భారతదేశం లోని గుజరాత్ లో ఉండే పప్పు శుక్లాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. రోడ్డు మీద జీవనం సాగించే అతడు.. ఎన్నో వీధికుక్కల ఆలనాపాలనా చూసుకుంటూ ఉండేవాడు. ఆయన చనిపోవడంతో ఆ కుక్కలు అతడి మృతదేహం చుట్టూ చేరిపోయాయి. అతడి మృతదేహాన్ని ఎవరూ తాకడానికి వీలు లేదన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నాయని ట్వీట్ ద్వారా చెప్పుకొచ్చారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు.

న్యూస్ మీటర్ ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా అక్టోబర్ 2020 న పబ్లిష్ చేసిన ఆర్టికల్ లభించింది. 'Ababil’ అనే యెమెని వెబ్ సైట్ లో ఈ ఘటన గురించి రాసుకుని వచ్చారు. ఇల్లు లేని ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా వీధి కుక్కల ఆలనా పాలనా చూస్తూ ఉన్నాడని రాసుకుని వచ్చారు. ఆ వ్యక్తి చనిపోవడంతో అతడి మృతదేహాన్ని తాకడానికి ఎవరినీ దగ్గరకు రానివ్వడం లేదట.. ఆ వ్యక్తి పేరు 'ఇస్మాయిల్ ముహమ్మద్ హది' అని చెప్పుకొచ్చారు. యెమెన్ ఐబీబీ గవర్నరేట్ ప్రాంతంలో ఆ వ్యక్తి చనిపోయాడు. దీంతో అతడు పెంచిన కుక్కలన్నీ ఎంతో బాధతో ఉన్నాయని స్థానికులు కూడా చెప్పారు.

Al Jazeera Mubasher కథనంలో కూడా ఆ వ్యక్తిని ఇస్మాయిల్ హది అని చెప్పుకొచ్చారు. యెమెన్ కు చెందిన వ్యక్తి అని తెలిపారు. అతడు చనిపోవడంతో మృతదేహాన్ని తాకడానికి ఎవరినీ దగ్గరకు రానివ్వడం లేదట.

01

Asharq Al-Awsat న్యూస్ పేపర్ ఎడిటర్ కూడా చనిపోయిన వ్యక్తి ఇస్మాయిల్ హది అంటూ ధృవీకరించారు. యెమెన్ రోడ్డు పక్కన అతడి మృతదేహం ఉన్న ఫోటోను కూడా పోస్టు చేశారు.



గుజరాత్ కు చెందిన పప్పు శుక్ల చనిపోవడంతో కుక్కలు ఇలా చుట్టూ చేరాయి అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు. ఈ ఫొటోల్లో ఉన్న వ్యక్తి యెమెన్ కు చెందిన ఇస్మాయిల్ హది.

Next Story