ఏనుగు మృతికి అసలు కారణాలు బయటపెట్టిన పోస్టుమార్టం రిపోర్ట్..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Jun 2020 11:31 AM ISTరెండ్రోజుల క్రితం కేరళలోని పాలక్కడ్ జిల్లాలో గర్భంతో ఉన్న ఓ ఏనుగు పేలుడు పదార్థాలతో కూడిన పైనాపిల్ తినడం వల్ల మృతి చెందిందన్న వార్త అటు సోషల్ మీడియాలోనూ, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల్లోనూ సంచలనం సృష్టించింది. దేశ వ్యాప్తంగా ఏనుగు మృతికి మనుషులే కారణమయ్యారన్న దానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమయింది. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ ఆఖరికి.. టాటా సంస్థల అధినేత రతన్ టాటా కూడా ఈ విషయంపై స్పందించారంటే.. అది ఎంత దీనస్థితిలో చనిపోయి ఉంటుందో అర్థం చేసుకోవాలి. సమాజంలో మానవత్వం చనిపోయిందంటూ సోషల్ మీడియాలో ఏనుగు, దాని పిల్ల మాటలతో కూడిన మీమ్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి.
తాజాగా విడుదలైన ఏనుగు పోస్టుమార్టం రిపోర్ట్ లో అసలు నిజాలు బయటపడ్డాయి. ఆ ఏనుగు బాణసంచా కూరిన పైనాపిల్ తినడం వల్లే దాని నోటికి తీవ్రగాయాలయ్యాయని తేలింది. ఆ బాధలో 14 రోజుల పాటు ఏమీ తినకుండా ఆకలితో, కడుపులో బిడ్డతో ఉండటం వల్ల ఊపిరి తిత్తులు పాడయ్యాయని వైద్యులు పోస్టుమార్టం రిపోర్ట్ లో పేర్కొన్నారు. కాగా.. విచారణలో భాగంగా స్థానికులు చెప్పిన వివరాల మేరకు మే 23న తిండి కోసం గ్రామంలోకి వచ్చిన ఏనుగు తిరిగి అడవిలోకి వెళ్లి.. మళ్లీ 25న గ్రామంలోకి వచ్చింది. అప్పుడే ఎవరో దానికి బాణసంచా పెట్టిన పైనాపిల్ తినపించడంతో అది చనిపోయిందని తెలుస్తోంది.