పాకిస్థాన్ జట్టు ఓపెనర్‌కు కరోనా వైరస్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 24 May 2020 1:57 PM GMTపాకిస్థాన్ క్రికెట్ జట్టు ఓపెనర్ తౌఫీక్ ఉమర్ కు కరోనా వైరస్ సోకింది. తౌఫీక్ ఉమర్ కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్లు తేలిందని.. అయితే లక్షణాలు మరీ అంత తీవ్రంగా లేవని అధికారులు తెలిపారు. 38 సంవత్సరాల తౌఫీక్ ఉమర్ కోవిద్-19 సోకిన నాలుగో క్రికెటర్. స్కాట్లాండ్ కు చెందిన మాజిద్ హక్, పాకిస్థాన్ కు చెందిన జఫర్ సర్ఫరాజ్, దక్షిణాఫ్రికాకు చెందిన సోలో నెక్వెనికి కూడా కోవిద్-19 పాజిటివ్ గా రిపోర్ట్ వచ్చింది.
తాజాగా తౌఫీక్ ఉమర్ ఆ లిస్టులో చేరాడు. గత రాత్రి తనకు కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చిందని తెలిపాడు తౌఫీక్. జియో న్యూస్ తో తౌఫీక్ ఉమర్ మాట్లాడుతూ.. రెండు రోజులుగా తనకు నలతగా అనిపించిందని.. వెంటనే వైద్యులను సంప్రదించానని.. రిపోర్టులో కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపాడు. ప్రస్తుతానికి లక్షణాలు మరీ తీవ్రంగా లేవని.. ప్రస్తుతానికి ఇంట్లోనే వుంటున్నానని తెలిపింది. తాను వేగంగా కోలుకోవాలని అభిమానులు ఆ దేవుణ్ణి ప్రార్థించాలని కోరాడు.
తౌఫీక్ ఉమర్ పాకిస్థాన్ తరుపున 44 టెస్టులు 12 వన్డేలు ఆడాడు. 2963 పరుగులు వన్డేల్లో, 504 పరుగులు టెస్టుల్లో నమోదు చేశాడు తౌఫీక్. చివరిసారిగా పాకిస్థాన్ జట్టులో 2014లో ఆడాడు తౌఫీక్.
పాకిస్థాన్ లో కూడా కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. 54,601 పాజిటివ్ కేసుల మార్కును పాకిస్థాన్ తాజాగా దాటేసింది. 1133 కరోనా మరణాలు ఇప్పటిదాకా సంభవించాయి. రంజాన్ పండుగ సందర్భంగా ప్రజలు మసీదులకు వెళ్ళినప్పుడు సామాజిక దూరాన్ని పాటించాలని అధికారులు కోరారు. ముఖ్యంగా బంధువుల, మిత్రుల ఇళ్లకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. ఈద్ కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వస్తూ ఉండడంతో అధికారులు చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు.