Fact Check : 20 మంది భారత సైనికులు మరణించారని పాక్, చైనా సైనికులు డ్యాన్స్ చేశారా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 July 2020 1:34 PM ISTగల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య చోటు చేసుకున్న గొడవల కారణంగా ఇరు దేశాలకు చెందిన సైనికులు కూడా మరణించారు. మరణించిన భారత సైనికుల సంఖ్య 21కి చేరింది. కానీ చైనా మాత్రం ఈ ఘటనపై నోరు విప్పడం లేదు. ఇకపై హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలని ఇరు దేశాల ఉన్నతాధికారులు తమ తమ బృందాలకు సూచనలు జారీ చేశారు. ఇలాంటి సమయంలో భారత్ కు చెందిన సైనికులు మరణించారన్న ఆనందంలో పాకిస్థాన్-చైనా సైనికులు డ్యాన్స్ చేశారంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది.
ట్విట్టర్ యూజర్ Bhushan Lal Koul ఓ వీడియోను షేర్ చేశాడు. “#China #Pakistan both R dancing across the #border after brutally #killing 20 #Indian #soldiers. India is not as India as 1962. Soon both of you will regret it. “How’s the josh”!!! I said “How’s the josh”!!” అంటూ వీడియోను షేర్ చేశాడు. "చైనా పాకిస్థాన్ సైనికులు బోర్డర్ లో డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. భారత్ 1962 లో లాగా లేదు.. మీరు తప్పకుండా బాధపడతారు" అని తన ట్వీట్ ద్వారా చెప్పుకొచ్చాడు.
#China #Pakistan both R dancing across the #border after brutally #killing 20 #Indian #soldiers.
India is not as India as 1962.Soon both of you will regret it.
"How's the josh"!!! I said "How's the josh"!!#Ladakh #ChinaGetOut @knowinglamba #BYCOTTMADEInCHINA #ChinaIndiaFaceoff pic.twitter.com/MiIkCWUjVy
— Bhushan Lal Koul (@BhushanLalKoul2) June 18, 2020
చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్వర్క్(సిజిటిఎన్) న్యూస్ ప్రొడ్యూసర్ అంటూ ఉన్న Shen Swei ప్రొఫైల్ లో కూడా ఈ వీడియోను జూన్ 18న పోస్ట్ చేశాడు. ఆ వీడియోకు ‘Dancing Time’(డ్యాన్సింగ్ టైమ్) అనే క్యాప్షన్ ను ఉంచాడు. గల్వాన్ లోయలో జూన్ 16న భారత్-చైనా సైనికుల మధ్య గొడవ చోటుచేసుకుంది.
Dancing time~ 🇨🇳🇵🇰#China #Pakistan border~ pic.twitter.com/IOIGWziIS6
— Shen Shiwei沈诗伟 (@shen_shiwei) June 18, 2020
ఫేస్ బుక్ లో కూడా పలువురు ఈ వీడియోను షేర్ చేశారు.
నిజ నిర్ధారణ:
ఈ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని, అలాగే కీ వర్డ్స్ ‘Pakistan and China army celebrations’ ను ఉపయోగించి సెర్చ్ చేయగా ‘Amyn Yar Baig’ అనే యూట్యూబ్ ఛానల్ లో నవంబర్, 2018లో ఈ వీడియోను పోస్టు చేశారు. “#Pakistan and #China Soldiers are #Dance on Khunjrab #CPEC #Army #hunza #gilgitbaltistan” అనే టైటిల్ ను వీడియోకు ఉంచారు. పాకిస్థాన్, చైనా సైనికులు డ్యాన్స్ చేస్తున్న వీడియో అని అందులో తెలిపారు.
మరిన్ని సెర్చ్ రిజల్ట్స్ లో ట్రావెల్ వ్లాగర్ అయిన Jojo Aigner యూట్యూబ్ ఛానల్ లో ఒరిజినల్ వీడియో లభించింది. ఈ వీడియోను జోజో తీశాడు. మొత్తం 25 నిమిషాల వీడియో ఇది.. పాకిస్థాన్ బోర్డర్ లో నుండి చైనాకు వెళుతున్న సమయంలో ఈ వీడియోను షూట్ చేశాడు. జోజో టర్కీ, ఇరాన్, పాకిస్థాన్ నుండి చైనాకు చేరుకున్నదాన్ని తన కెమెరాలో నిక్షిప్తం చేశాడు.
ఈ వీడియో నుండి వైరల్ వీడియోను తీసుకున్నారు. ఈ వీడియోలో 8:30 నిమిషాల నుండి 9:26 నిమిషాల మధ్య జరిగిన సన్నివేశాలను ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. ఆ వీడియో పాకిస్థాన్, చైనా సైనికులు ఫ్రెండ్లీ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు.
భారత సైనికులు 20 మంది చనిపోయారని ఆనందంతో పాక్-చైనా సైనికులు డ్యాన్స్ చేశారన్న వీడియో 'పచ్చి అబద్దం'.