అమెరికా కంపెనీల్లో కులవివక్ష ఎదుర్కొంటున్న వారి సమాచారాన్ని సేకరిస్తున్న సంస్థ
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 29 July 2020 11:43 AM IST
సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు మారినా కూడా కులం పేరుతో ఇంకా దూషణలు జరుగుతూనే ఉన్నాయి. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఎంతో మంది కులానికి సంబంధించిన దూషణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీలలో కూడా తక్కువ కులానికి చెందిన వారంటూ నీచంగా మాట్లాడడం వంటివి జరుగుతూ ఉన్నాయి. వీటిపై సమగ్ర సమాచారం తెలుసుకోవడం కోసం ఓ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.
భారత్ కు చెందిన ఉద్యోగులు ఉన్న చోట కుల వివక్ష ఘటనలకు సంబంధించిన సమాచారాన్ని కాలిఫోర్నియాకు చెందిన అంబేద్కర్ కింగ్ స్టడీ సర్కిల్(ఏకేఎస్సి) సేకరిస్తోంది. బాధితులకు అండగా నిలవడానికి ప్రయత్నిస్తోంది. కుల వివక్ష ఎదుర్కొన్న వారి దగ్గర సమాచారాన్ని సేకరించి.. న్యాయపరమైన చర్యలు తీసుకునే విధంగా ముందుకు వెళుతోంది.
ప్రముఖ సాఫ్ట్ కంపెనీ సిస్కో సంస్థలో కుల వివక్ష ఘటన కారణంగా పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే..! సిస్కో సిస్టమ్స్‌లో భారత్‌కు చెందిన ఓ దళిత ఇంజనీర్ కులవివక్షకు గురయ్యాడని తెలుస్తోంది. కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫెయిర్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ హౌసింగ్ (డీఎఫ్ఈహెచ్) ఆ సంస్థపై దావా దాఖలు చేసింది. కంపెనీకి చెందిన సిలికాన్ వ్యాలీ హెడ్‌క్వార్టర్స్‌లోనే ఈ సంఘటన వెలుగుచూసింది.
బాధిత ఇంజనీర్ భారత్‌కు చెందిన అగ్రకులస్తులున్న టీమ్‌లోనే పనిచేస్తూ ఉండగా వివక్షకు, వేధింపులకు గురైనట్టు దావాలో తెలిపింది. కాలిఫోర్నియా న్యాయ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కుల వివక్ష బాధిత ఇంజనీర్ కు టీమ్ లో తక్కువ పొజిషన్ ఇచ్చారు. అలాగే అతడికి తక్కువ జీతం ఇచ్చేవారట. ఈ సంఘటనపై సరైన చర్య తీసుకోనందుకు సిస్కో కంపెనీపై డీఎఫ్ఈహెచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కుల వివక్ష ఎదుర్కొన్నప్పుడు పలు సంస్థలు.. ఉద్యోగుల నోరు మెదపనివ్వడం లేదని ఏకేఎస్సి మెంబర్ కార్తికేయన్ షణ్ముగం తెలిపారు. తాము ఇప్పటికే చాలా మంది బాధితుల నుండి సమాచారాన్ని సేకరిస్తున్నామని తెలిపారు. 60 మంది దాకా తాము ఎదుర్కొన్న కుల వివక్ష గురించి ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పారని.. వారంతా టెక్నాలజీ కంపెనీలకు చెందిన వారేనని చెబుతున్నారు కార్తికేయన్ షణ్ముగం. ఈ కుల వివక్షకు సంబంధించిన ఘటనలు పునరావృతం కాకుండా చేయడానికి డీఎఫ్ఈహెచ్ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది.