మా పార్టీ.. ఏ పార్టీకి జూనియర్ పార్టీ కాదు.. రాంమాధవ్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Oct 2019 12:59 PM IST![మా పార్టీ.. ఏ పార్టీకి జూనియర్ పార్టీ కాదు.. రాంమాధవ్ మా పార్టీ.. ఏ పార్టీకి జూనియర్ పార్టీ కాదు.. రాంమాధవ్](https://telugu.newsmeter.in/wp-content/uploads/2019/10/Ram-madhav.jpg)
విజయవాడ: ఏపీలో నిర్ణయాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్. విజయవాడ సింగ్‌నగర్‌లో బీజేపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయాన్ని రాంమాధవ్ ప్రారంభించారు.
నాలుగు నెలల కాలంలో ప్రభుత్వ పథకాలు అధికార పార్టీ కార్యకర్తలకు మాత్రమే అందుతున్నాయని, గత ప్రభుత్వ హయాంలో కూడా ఇదే విధంగా జరిగిందని రాంమాధవ్ మండిపడ్డారు. గతంలో టీడీపీ, ఇప్పుడు వైసీపీ కూడా కేంద్ర పథకాలను తమ పథకాలుగా చెబుతోందన్నారు.
లబ్ధిదారుల ఎంపికను వైసీపీ కార్యకర్తలకు కమిటీల ద్వారా చేయడం సరికాదన్నారు. టీడీపీని వదిలి చాలా మంది నాయకులు బీజేపీలో చేరుతున్నారన్నారు. చంద్రబాబు బీజేపీతో పొత్తు వదిలామని బాధపడుతున్నారని భావిస్తున్నానని రాంమాధవ్ అన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా ముందుకు వెళ్లాలని ఆ దిశగా పార్టీని అభివృద్ధి చేస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి బీజేపీ జూనియర్ పార్టీగా వ్యవహరించదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు.