నచ్చిన సినిమా.. నచ్చినపుడు చూసేయండి.!
By మధుసూదనరావు రామదుర్గం Published on 16 July 2020 6:55 AM GMTమీడియానే కాదు మూవీ ఇండస్ట్రీ కూడా డిజిటల్ దిశగా అడుగులేస్తోంది. బడా బడా కంపెనీలు ఓటీటీ (ఆన్ ద టాప్) యాప్ లను తయారు చేసుకోవడంలో పోటీ పడుతున్నాయి. కరోనా కష్టకాలంలో కొత్తగా నిర్మించిన సినిమాలను ప్రేక్షకులకు చేరువ చేయడానికి ఓటీటీలు వారధులుగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే నిన్న ప్రతిష్టాత్మకంగా జరిగిని రిలయన్స్ వార్షిక సాధారణ సమావేశంలో కొత్త ఓటీటీ తెస్తున్నట్టు ప్రకటించారు.
ఈ సమావేశంలో ఎన్నో నిర్ణయాలను ప్రకటించినా.. సినిమా వినోదానికి సంబంధించి రిలయన్స్ గ్రూప్ కొత్త ఓటీటీ ప్లాట్‌ఫాం జియో టీవీ ప్లస్ మార్కెట్‌లో తెస్తున్నట్టు తెలపి కొత్త సంచలనానికి తెరలేపింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీహాట్ స్టార్, సోనీ లైవ్ తోపాటు 12 ఓటీటీ ప్లాట్ ఫాం లు జియో వినియోగదారుడు ఒక జియో టీవీ ప్లస్ లోనే ఉంటాయని.. ప్రేక్షకులు ఏ ఓటీటీ కావాలనుకున్నా ఈ టీవీ ద్వారానే ఎంపిక చేసుకుంటూ కావల్సిన సినిమా.. సీరియళ్లను చూడొచ్చు. జియో ఫోన్లే సంచలనం అనుకుంటే.. ఇప్పుడీ కొత్త వినోద విప్లవానికి రిలయన్స్ గ్రూప శ్రీకారం చుట్టింది. రానున్న కాలంలో మరెన్నో కొత్త మలుపుల్లో సగటు ప్రేక్షకుల్ని తీసుకెళ్లడానికి జియో టీవీ ప్లస్ వారథిగా నిలవబోతోంది.
మరి 12 ఓటీటీలు ఒక టీవీలోనే వస్తే నచ్చిన సినిమానో.. సీరియల్ నో చూడటం ఎలా అన్న ప్రశ్న తలెత్తవచ్చు. కానీ ఈ జియో టీవీ ప్లస్ నిర్మాణంలో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించారు. టీవీలోని ఇంటర్ ఫేస్ ఆటోమెటిక్ గా వస్తున్న కంటెంట్‌ను వివిధ విభాగాల్లోకి పంపించేస్తుంది. దీంతో వెతకడం సులువవుతుంది. సినిమాలో టీవీ షోలను వేర్వేరుగా అమర్చడం వల్ల జియో టీవీ ఆపరేట్ చేసేవారికి సందేహాలు తలె్త్తే సమస్యే ఉండదిక. ఈ టీవీలోని మరో అదనపు ఫీచర్ ప్రేక్షకులకు సహాయకారిగా ఉంటుంది...అదే వాయిస్ కమాండ్. అంటే మీరు టీవీ ఆన్ చేసి ఫలాన కావాలని చెబితే చాలు అదే తెరపై ప్రత్యక్షమవుతుంది. మొత్తానికి ఓటీటీ ప్లాట్ ఫాంలలో జియో టీవీ ప్లస్ ఒక సంచలనంగా నిలవబోతోంది.
ఓటీటీ హవా ఇలా షురూ:
కరోనా పుణ్యమా అని మల్టీ ప్లెక్స్ లోని బిగ్ స్క్రీన్లున్న థియేటర్లలో సినిమాలను ఆస్వాదించే అవకాశం అందరం కోల్పోయాం. మళ్లీ ఆ మంచి రోజులు ఎప్పుడు వస్తాయోనన్న దిగులు సగటు ప్రేక్షకుడి మనసులో ఉండనే ఉంటుంది. కరోనా తగ్గేదాకా సినిమాలు చూసే వీలే లేదు అనే సంక్లిష్ట సమస్యల నుంచి పుట్టుకొచ్చిన పరిష్కారం ఓటీటీ (ఆన్ ద టాప్) ప్లాట్‌ఫారం. ఈ ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేసుకునే వీలుంది. యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే స్మార్ట్ ఫోన్లో.. లేదా స్మార్ట్ టీవీల్లో రిలీజైన సినిమాలు చూడొచ్చు. అంటే ప్రేక్షకుడు సినిమాలకు దూరమయ్యే ప్రమాదానికి కొత్త సాంకేతికత చెక్ పెట్టిందన్నమాట.
దాదాపు నాలుగు నెలల కిందట కరోనా విలయం ప్రారంభంలో సినిమా మేకర్స్ గుండెల్లో గుబులు పట్టుకుంది. రిలీజ్ కు రెడీ ఉన్న సినిమాలు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న విచిత్ర పరిస్థితి. మరి థియేటర్లను బంద్ పెట్టాక.. సినిమాలను రిలీజ్ చేయడం ఎలా అని మథనపడ్డారు. అప్పుడే ఓటీటీ తెరపైకి వచ్చింది. చిన్నసినిమాల నిర్మాతలు ముందూ వెనక చూడకుండా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వ్యాపారంలో అటూ ఇటూగా ఒప్పందం కుదుర్చుకుని సినిమాలు రిలీజ్ చేసేశారు. ఆ క్రమంలోనే తెలుగులో అమృతరామం.. లూజర్.. విడుదలయ్యాయి. ఇంకా తెలుగులో విలన్, ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా? సినిమాలు ఓటీటీలో విడుదల దాకా వచ్చి వివిధ కారణాల వల్ల ఆగిపోయాయి.
తమిళంలో పెంగ్విన్ హిందీలో అమితాబ్ ఆయుష్మాన్ కలిసి నటించిన గులాబోసితాబో వంటి పెద్ద సినిమాలు కూడా విడుదలయ్యాయి. పెంగ్విన్ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తానన్నప్పుడు నటుడు నిర్మాత సూర్యపై తమిళనాడు చిత్ర నిర్మాతలు పెద్ద యుద్ధమే ప్రకటించారు. ఇలాంటి భారీ సినిమాలను ఓటీటీలో విడుదల చేయడం ఎంత వరకు సబబని విమర్శించారు. వారందరికీ సూర్య ఇచ్చిన సమాధానం ఒకటే.. ఇంత ఖర్చు పెట్టి తీసిన సినిమాను ఇంట్లోనే పెట్టేసుకుంటే వడ్డీలు ఎవరు కడతారు? ఇలా వద్దనుకుంటే ఇక బజారున పడాల్సిందే అని ఘాటుగా సమాధాన మిచ్చారు.
అదే సమయంలో హిందీలో గులాబో సితాబో ఓటీటీలో విడుదలయ్యాక.. అక్షయ్ కుమార్ లక్ష్మీబాంబ్ ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. వందల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన పెద్ద పెద్ద సినిమాలు ఓటీటీ లో వచ్చేస్తే.. సినిమారంగం కుదేలవుతుందని చాలా మంది బాహటంగానే విమర్శించారు. మరి వేరే దారి లేనపుడు ఉన్న బాటలో నడవడమే ఉత్తమం కదా అన్నది నిర్మాతల వాదన. ఇలా సినిమా సమస్య పరిష్కార సూత్రంగా ప్రారంభమైన ఓటీటీ క్రమంగా పుంజుకుని రానున్న కాలంలో శాసించే స్థాయికి పరుగులు పెడుతోంది.