అపోజిషన్ వర్సెస్ మోదీ.. 'ఎలకలూ పిల్లుల' కథ..!

By Newsmeter.Network  Published on  16 Jan 2020 12:02 PM IST
అపోజిషన్ వర్సెస్ మోదీ.. ఎలకలూ పిల్లుల కథ..!

పాత కాలం కథ ఒకటుంది. ఎలకలన్నీ కలిసి పిల్లిపై పోరాటం ప్రకటించాయి. ఎలకలన్నీ పెద్ద సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. పిల్లి మెడలో గంట కట్టాలని నిర్ణయించుకున్నాయి. కానీ కొన్ని ఎలకలు పిల్లిని నానా తిట్లు తిడుతూనే సమావేశాన్ని బహిష్కరించాయి. మిగతా పిల్లులు ఏలాగోలా సమావేశమయ్యాక నాయకత్వం ఎవరి చేతుల్లో ఉండాలన్న ప్రశ్న తలెత్తింది. అందరి కన్నా బలహీనంగా ఉన్న ఎలక లేవలేను గానీ చావగొట్టగలను అని ప్రకటించుకుంది. మీ అందరికీ నేతను నేనే అంది. ఇంకో ఎలకకి దాక్కోవడానికి కలుగు కూడా లేదు. అయినా సైద్ధాంతిక మార్గదర్శనం నేనే చేస్తానంది. చివరికి సమావేశం అయింది. సగం మంది రాలేదు. వచ్చిన సగం మందికి విలన్ ఎవరో తెలుసు కానీ నాయకుడెవరో తెలియలేదు. మళ్లీ మరో సారి మరో చోట సమావేశం కావాలని ఎలకలు నిర్ణయించుకున్నాయి.

టూకీగా ఇటీవల విపక్షాలన్నీ కలిసి నిర్వహించిన మోదీ వ్యతిరేక సమావేశం కథ ఇది. పిల్లి మెడలో గంట కట్టలేదు. కానీ గంటల పాటు ఎలకలన్నీ కొట్టుకున్నాయి. కానీ ఎవరితో పోరాడాలో మాత్రం తేల్చుకోలేకపోయాయి. ఇదే జరిగింది. బెంగాల్ లో బలం ఉన్న మమతా దీదీ సమావేశాన్ని బహిష్కరించింది. ఉత్తరప్రదేశ్ లోని దళిత ఓట్ల మూటలపై కూర్చున్న మాయావతి మీటింగ్ కు రానన్నది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఢిల్లీ కలుగులోనే ఉండిపోయింది. ఇవన్నీ చాలవన్నట్టు ఉద్ధవ్ థాకరే అనే పిల్ల ఎలుక తల్లి కాంగ్రెస్, తండ్రి ఎన్సీపీలను ధిక్కరించి “పార్టీ” చేసుకుంటూ ఉండిపోయింది. మీటింగ్ కి వచ్చినా డీఎంకే ఎడ్డెం అంటే తెడ్డెం అని చక్కా వెళ్లిపోయింది.

మీటింగ్ లో ఏదో జరుగుతుందని ఆశించిన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వామపక్ష విద్యార్థులకు నిరాశే మిగిలింది. జమ్మూ కశ్మీర్ లోని వేర్పాటువాదులకు తమ కోరిక తీరేలా లేదని అర్థమైపోయింది. ఢిల్లీలోని బిజెపి వ్యతిరేక పత్రికా విలేఖరులకు ఈ సమావేశం వల్ల నిప్పు రాదు, పొగ లేదని అర్థమైపోయింది. దాంతో వాళ్లూ నిరాశలో కూరుకుపోయారు.

ఈ మీటింగ్ ను చూసి నరేంద్ర మోదీ అనే గండుపిల్లి తృప్తిగా మీసాలు తుడుచుకుంటూ నవ్వుకుంది. “వెర్రి అపోజిషన్... ఎవరి పొజిషన్ ఏమిటో తెలియకుండానే అపొజిషన్ చేస్తామంటున్నారు. పిల్లికి వ్యతిరేకంగా ఇంకో పిల్లిని తయారు చేయాలి కానీ పిల్లితో ఎలకలు ఎప్పుడు పోరాడాలి?” అనుకుని ఆనందంగా కూర్చుంది.

అన్నట్లు... పిల్లికి వ్యతిరేకంగా ఇంకో పిల్లిని తయారు చేస్తే అది ముందు ఎలకలన్నిటినీ తినేయదూ? ఈ చిన్ని లాజిక్ ఎలకలకు ఎందుకు అర్థం కావటం లేదబ్బా??

Next Story