తెలంగాణలో ఆన్‌లైన్ క్లాసుల మార్గదర్శకాలు విడుదల
By తోట వంశీ కుమార్ Published on 25 Aug 2020 2:34 PM GMTకరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోనే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యాసంస్థలు ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకు విద్యాశాఖకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలల్లో 2020-2021 విద్యా సంవత్సరం ప్రారంభం అవుతున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది.
మరీ ఆన్‌లైన్ క్లాసులు ఎంత సేపు జరగాలి..? ఎన్ని గంటలు జరగాలి..? ఎన్ని గంటలు జరగాలనే దానిపైనా గైడ్ లెన్స్ రిలీజ్ చేసేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.
నర్సరీ, ఎల్‌కేజీ విద్యార్థులకు 45 నిమిషాల పాటు రోజుకు రెండు క్లాసులు మాత్రమే నిర్వహించాలని గైడ్‌లైన్స్‌లో పేర్కొంది. నర్సరీ, కేజీ విద్యార్థులకు వారానికి 3 రోజుల పాటు మాత్రమే తరగతులు బోధించాల్సి ఉంటుంది. 1వ క్లాస్ నుంచి 5వ తరగతి వరకు రోజుకు గంటన్నరపాటు రెండు క్లాసులు, 6 నుంచి 8వ తరగతి వరకు రోజుకు 2 గంటల చొప్పున మూడు క్లాసులు బోధించాల్సి ఉంటుంది. ఇక, 9 నుంచి 12వ తరగతి వరకు రోజుకు 3 గంటల పాటు 4 క్లాసులు బోధించాలని మార్గదర్శకాల్లో తెలిపారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా సెప్టెంబర్ ఒకటి నుంచే ఆన్‌లైన్ తరగతులు ప్రారంభం అవుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వీరితో పాటు, డిగ్రీ, పీజీ విద్యార్థులకు కూడా అదే రోజు నుంచి ఆన్‌లైన్ బోధన ప్రారంభం అవుతుందని ఆమె స్పష్టం చేశారు. దీని కోసం అధ్యాపకులు, ఉపాధ్యాయులకు శిక్షణ పూర్తి చేశామని తెలిపారు. అధ్యాపకులు ఈ నెల 27 నుంచే కళాశాలలకు వెళ్ళాలని ఆదేశాలు జారీ చేశారు.