ఉల్లి ఎగుమతులపై నిషేధం.. ధరలపై కేంద్రం సంచలన నిర్ణయం

By సుభాష్  Published on  15 Sep 2020 2:59 AM GMT
ఉల్లి ఎగుమతులపై నిషేధం.. ధరలపై కేంద్రం సంచలన నిర్ణయం

దేశంలోఉల్లి ధరలు ఆకాశం అంటుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉల్లి ధర.. సామాన్యులను కన్నీళ్లు పెట్టిస్తోంది. భారీ వర్షాలు ఉల్లి పంటపై తీవ్ర ప్రభావం పడటంతో కొరత ఏర్పడి ధరలు ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. దీంతో ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణపై చర్యలు చేపట్టింది. ఉల్లి ఎగుమతిపై నిషేధం విధించింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర వాణిజ్య శాఖ డైరెక్టర్‌ జనరల్‌ సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ప్రకటన వెలువడే వరకు ఉల్లి ఎగుమతులను నిలిపివేయాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దేశంలో ఉల్లిపాయల లభ్యతను పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సర్కార్‌ వెల్లడించింది. సామాన్యుడి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ధరలు తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది కేంద్రం.

ఆసియాలో భారత్‌ అతిపెద్ద ఉల్లి ఎగుమతి దారు..

కాగా, ఆసియాలో భారత్‌ అతిపెద్ద ఉల్లి ఎగుమతిదారుగా ఉంది. ముఖ్యంగా దక్షిణాసియాలోని బంగ్లాదేశ్‌, నేపాల్‌, మలేషియా, శ్రీలంక వంటి దేశాలు ఉల్లి కోసం భారత్‌పైనే ఆధారపడతాయి. దేశంలో అతిపెద్ద ఉల్లి మార్కెట్‌ లాసల్‌గావ్‌లో నెల రోజుల వ్యవధిలో టన్ను ఉల్లి ధర మూడు రేట్లు పెరిగింది. అక్కడ టన్ను ఉల్లి ధర పెరిగి ప్రస్తుతం రూ. 30 వేలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కిలో ఉల్లీ రూ. 40 పలుకుతోంది. మిగతా నగరాల్లో కూడా దాదాపుగా ధర అంతే ఉంది. రానున్న రోజుల్లో ఇది మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఉల్లి పంటపై భారీ వర్షాల ప్రభావం

గత నెలలో దేశ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు ఉల్లి పంటపై తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉల్లి ఉత్తి తీవ్రంగా పడిపోడంతో ఉల్లి కొరత ఏర్పడటంతో ధరలు భగ్గుమంటున్నాయి. గత ఏడాది కూడా డిసెంబర్‌లో ఏకంగా ఉల్లి ధర కిలో రూ. 150 కూడా పలికింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ సమయంలో కూడా ధరలు మండిపోయాయి. ముందు కరోనా ప్రభావం పనులు లేక విలవిలలాడే సామాన్యులకు ఉల్లి కొనకుండానే కన్నీళ్లు వచ్చాయి.

Next Story
Share it