తగ్గనున్న మాస్క్‌లు, పీపీఈ కిట్ల ధరలు
By సుభాష్ Published on 14 Sep 2020 5:00 AM GMT
కరోనా మహమ్మారి నుంచి కాపడుకునేందుకు మాస్క్‌లు, పీపీఈ కిట్లు ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో వాటికి డిమాండ్ ఎంతో పెరగడంతో ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. ఒక్కో సర్జికల్ మాస్క్ 20 నుంచి నుంచి 30 వరకు, సీపీఈ కిట్ రూ. 600 నుంచి 1000 వరకు, అలాగే ఎన్-95 మాస్క్‌లు రూ.300 నుంచి 400 వరకు అమ్మేవారు. అప్పట్లో తయారీ సంస్థలు లేకపోవడం, ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడంతో ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్మేవారు.
ఇప్పుడు వాటి ధరలు తగ్గనున్నాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మాస్క్‌లు,పీపీఈ కిట్ల తయారీ సంస్థలు పెరిగి, ఉత్పత్తి కూడా పెరగడంతో ధరలు పడిపోతున్నాయి. ఇక వీటి రేట్లు తగ్గడంతో ఏపీ ప్రభుత్వం టెండర్లను పిలిచింది. ఈ నేపథ్యంలో ఓ సంస్థ మాస్క్‌కు రూ.2.36పైసలు, పీపీఈ కిట్‌కు రూ.291కి కోట్ చేసింది. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా 25 లక్షల మాస్క్ లు, 10 లక్షల పీపీఈ కిట్లకు ఆర్డర్ ఇచ్చింది.
ఇప్పుడు ఏపీతోపాటు ఇతర రాష్ట్రాల్లె కూడా మాస్క్‌లు, పీపీఈ కిట్ల తయారీ సంస్థలు పెరగడం, అక్కడి నుంచి భారీగా ఉత్పత్తి అయి మార్కెట్లోకి వస్తుండటంతో ధరలు పడిపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు.