వెనక్కి తగ్గని జగన్‌.. కృష్ణాబోర్డుకు, కేంద్రానికి తెలంగాణ ఫిర్యాదు

By Newsmeter.Network  Published on  13 May 2020 4:32 AM GMT
వెనక్కి తగ్గని జగన్‌.. కృష్ణాబోర్డుకు, కేంద్రానికి తెలంగాణ ఫిర్యాదు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వాటర్‌ వార్‌ జఠిలమవుతున్నట్లు కనిపిస్తోంది. తమ నిర్ణయాన్ని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సమర్థించుకోవటంతో.. తెలంగాణ ప్రభుత్వం ఏపీ తీరుపై కృష్ణా బోర్డుకు, కేంద్రానికి ఫిర్యాదు చేసింది. శ్రీశైలం ప్రాజెక్టు నీటి తరలింపు కోసం పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యం, కాలువల సామర్థ్యం పెంచుతూ కొత్త ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు 203 జీవోనుసైతం విడుదల చేశారు. దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏపీతీరును తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. ఏపీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని, ఇలాంటి చర్యలను మానుకోవాలని హితవు పలికారు. సీఎం సూచనతో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందిస్తారని అందరూ భావించారు. కానీ జగన్మోహన్‌రెడ్డి ఏపీకి రావాల్సిన వాటానే మేం తీసుకుంటున్నామని, అలా చేయడంలో తప్పేంటని ప్రశ్నించారు. జగన్‌ తాజా వ్యాఖ్యలతో ఇరు రాష్ట్రాల మధ్య నీటి జగడం తారాస్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read :ఏపీ ఏకపక్ష నిర్ణయంపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం

ఇదిలాఉంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం తీరుపై ఫిర్యాదు చేసింది. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పోతిరెడ్డిపాడు విస్తరణ, లిఫ్ట్‌ పనులకు సంబంధించిన జీవో 203ను తక్షణమే రద్దు చేయాలని లేఖ రాశారు. దీంతో కృష్ణానదీయాజమాన్య బోర్డు రంగంలోకి దిగింది. దీనిపై నేడు ఆన్‌లైన్‌ విచారణ జరపాలని నిర్ణయించింది. ఇరు రాష్ట్రాలకు చెందిన కేఆర్‌ఎంబీ సభ్యులు, అంతరాష్ట్ర చీఫ్‌ ఇంజనీర్లు హాజరు కావాలని సూచించింది. సమస్య తీవ్ర త నేపథ్యంలో వెంటనే సమస్యను తెలుసుకొని స్పందించేందుకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు సిద్ధమైంది. ఇప్పటికే ఇరు రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. తమ నిర్ణయం సరైందేనని, నిబంధనలు ఎక్కడా తాము ఉల్లంఘించడం లేదని ఏపీ అధికార పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం తీరును తెరాస నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏకపక్ష నిర్ణయాలతో రెండు రాష్ట్రాల మధ్య సంఖ్యతను చెడగొట్టొద్దని సూచించారు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదం జఠిలమైనట్లు కనిపిస్తోంది.

Also Read :పసికందుతో 150 కి.మీ నడిచిన బాలింత..! చివరికి..

మరోవైపు ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై తెలంగాణలోని ప్రతిపక్షాలు సైతం మండిపడుతున్నాయి. ఒకపక్క ఏపీ సీఎం జగన్‌ నిర్ణయాన్ని తప్పుబడుతూనే కేసీఆర్‌ తీరుపైనా మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్లనే ఏపీ ఇలాంటి నిర్ణయం తీసుకుందని, తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని తెలంగాణలోని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. దీంతో ఏపీ తీరును నిరసిస్తూ, కేసీఆర్‌ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నేడు అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టారు. మరోవైపు తెలంగాణ బీజేపీ నేతలు అటు ఏపీ ప్రభుత్వం తీరుపైనా, తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. రాష్ట్ర అధ్యక్షులుతో పాటు పలువురు బీజేపీ నేతలు తమతమ ఇండ్లలోనే దీక్ష ద్వారా నిరసన కార్యక్రమం చేపట్టారు.

Also Read : ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం

Next Story