సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ జమ్ము కశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఒమర్‌ అబ్దుల్లా ఫోటోపై ప‌శ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎప్పుడూ గ‌డ్డం లేకుండా నీట్‌గా యువకుడిలా ఉండే ఒమర్‌ అబ్దుల్లా గుబురు గడ్డంతో ఉన్న‌ ఓ ఫోటో బయటకు వచ్చింది.

అయితే ఈ ఫోటోపై శనివారం రాత్రి మమత ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. తొలుత ఆ ఫోటో చూడ‌గానే తాను గుర్తుపట్టలేదని.. త‌ర్వాత‌ షాక్‌కి గురయ్యానని మమత అన్నారు. ఈ ఫోటోలో ఒమ‌ర్ ఉన్న ప‌రిస్థితి ప‌ట్ల‌ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో గృహ నిర్బంధం జరగడం దురుదృష్టకరం అని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి ఎప్పుడు ముగింపు..? అని ప్రశ్నించారు.

ఇదిలావుంటే.. ఒమర్ అబ్దుల్లా తాజా ఫోటోపై క‌శ్మీరు మాజీ ముఖ్య‌మంత్రి మెహాబూబా ముఫ్తితో పాటు పలువురు విపక్ష నేతలూ స్పదించారు. ఒమర్ అబ్దుల్లాను ఇలా చూసి నివ్వెరపోయామంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

కాగా జమ్మూ కశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తిని క‌లిగించే ఆర్టికల్‌ 370ని కేంద్రం 2019 ఆగస్టులో ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. అప్పట్నుంచి కశ్మీర్‌ ముఖ్యనేతలను ప్రభుత్వం గృహనిర్బంధంలో ఉంచింది. వారిలో ఒమర్ అబ్దుల్లా కూడా ఉండ‌టం.. అప్పటినుండి ఆయ‌న‌ గడ్డం తీయకపోవడంతో ఇలా కొత్త వేషంలో కనిపించారు.

అయితే.. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు అనంత‌రం.. ఆరునెలలుగా కేంద్ర ప్రభుత్వం కశ్మీర్‌లో ఇంటర్‌నెట్‌ సేవలను తొలగించడంతో ఇన్ని రోజులు ఈ ఫోటో బయటకు రాలేదు. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర‌ప్ర‌భుత్వం కశ్మీర్‌లో ఇంటర్‌నెట్‌ సేవలను పునరుద్ధరించింది. దీంతో ఈ ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హాట్ టాఫిక్‌గా మారింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.