Fact Check : తుని రైల్వే బ్రిడ్జి మునిగిపోయిందంటూ కథనాలు వైరల్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Oct 2020 12:08 PM GMT
Fact Check : తుని రైల్వే బ్రిడ్జి మునిగిపోయిందంటూ కథనాలు వైరల్..!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. వరద భీభత్సానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి. కొన్ని ఇప్పటివే కాగా.. ఇంకొన్ని ఎప్పటివో కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ ఉన్నారు. ఇలాంటి వీడియోలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాయి. రైల్వే బ్రిడ్జి మీద పెద్ద ఎత్తున నీరు చేరిపోయిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వరద నీరు ఎంతో ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడాన్ని గమనించవచ్చు.

మహారాష్ట్ర-కర్ణాటక రాష్ట్రాలను కనెక్ట్ చేస్తూ ఇటీవలే కట్టిన విజయ్ పూర్-సోలాపూర్ రైల్వే బ్రిడ్జి అని చెబుతూ ఉన్నారు. భీమ నది మీద కట్టిన బ్రిడ్జి అని చెబుతూ ఉన్నారు.

తెలుగు మీడియాకు చెందిన చాలా సంస్థలు తుని బ్రిడ్జి అని చెబుతూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాలోని తుని తాండవ బ్రిడ్జి అని చెప్పడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.

తుని బ్రిడ్జి మునిగిపోయింది అంటూ ప్రచారం చేశారు.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'

రైల్వే బ్రిడ్జి మీద నీరు ఉన్న ఘటన ఇప్పుడు చోటు చేసుకున్నది కాదు. 2012 లో చోటు చేసుకున్న ఘటన. 2020లో ఇటీవల జరిగిన ఘటన కాదు.

ఈ వీడియోకు సంబంధించిన కీ ఫ్రేమ్స్ ను తీసుకుని ఇన్విడ్ టూల్ ద్వారా రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఇప్పుడు వైరల్ చేస్తున్న వీడియోను 2012 నవంబర్ నెలలో యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఉండడాన్ని గమనించవచ్చు. ఆ వీడియోకు చెందిన సమాచారంలో 'తుని వరద నీరు.. తాండవ రైల్వే బ్రిడ్జి మీద' అని రాసుకుని వచ్చారు.

తుని-పాయకరావు పేట రైల్వే వంతెనపై పోటెత్తి ప్రవహిస్తున్న తాండవ నది చెబుతూ నీటిలో మునిగి ఉన్న రైల్వే బ్రిడ్జి సంబంధించిన ఫోటోలను గమనించవచ్చు.

తేదీ, సమాచారంతో అప్పట్లో చోటు చేసుకున్న వరద భీభత్సానికి సంబంధించి పోస్టు చేశారు కూడానూ..! ‘Furious Thandava overflows rail bridge with a jet speed in Tuni-East Godavari Dist. Andhra Pradesh – India on 4th November 2012 at 9 AM.’ అంటూ నవంబర్ 4వ తేదీ 2012లో చోటు చేసుకున్న ఘటన అని చెప్పుకొచ్చారు.

The Hindu కథనం ప్రకారం నవంబర్ 2012 సమయంలో భారీ వర్షాలు కురిశాయి. 36 గంటల పాటూ కుండపోతగా కురిసిన వర్షాలకు చాలా జిల్లాలు నీట మునిగాయి. విశాఖపట్నం మీద కూడా అప్పట్లో ఈ భారీ వర్షాలు ప్రభావం చూపించాయి. నేషనల్ హైవేలు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎన్నో రైళ్లను కూడా రద్దు చేశారు. విశాఖపట్నానికి చేరుకోవలసిన రైళ్లను రాజమండ్రి దగ్గరే నిలిపి వేశారు. తుని దగ్గర రైల్వే పట్టాల మీద నీరు ఉధృతంగా ప్రవహిస్తోందని రైల్వే అధికారులు అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ వీడియోను మరోసారి కొందరు వైరల్ చేశారు. ఎలెక్ట్రానిక్ మీడియా కూడా ఇది ఇటీవల చోటు చేసుకున్న ఘటన అంటూ ప్రసారం చేశారు. రైల్వే అధికారులు తుని బ్రిడ్జి దగ్గర ఇప్పుడు ఎలా ఉందో తెలియజేస్తూ ఫోటోలను, వీడియోలను పోస్టు చేశారు. వీడియోలో ఉన్నంత ఉధృతంగా నీరు ప్రవహించలేదు.. బ్రిడ్జి మీద నుండి నీరు వెళ్లడం లేదని స్పష్టం చేశారు.

సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కూడా ఈ ఘటన ఇప్పుడు చోటు చేసుకుంది కాదని వివరణ ఇచ్చారు.

తుని దగ్గర రైల్వే బ్రిడ్జి మీద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.

Claim Review:Fact Check : తుని రైల్వే బ్రిడ్జి మునిగిపోయిందంటూ కథనాలు వైరల్..!
Claim Reviewed By:Satyapriya
Claim Fact Check:false
Next Story