Fact Check : నరసారావు పేటలో సరస్వతి విగ్రహం ధ్వంసం ఘటన ఇప్పుడు చోటు చేసుకున్నదేనా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Oct 2020 11:01 AM GMTఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం మీద ఈ ఘటనల కారణంగా తీవ్ర ఆరోపణలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మరో పోస్టు కూడా వైరల్ అవుతోంది. సరస్వతి విగ్రహాన్ని ధ్వంసం చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు కొందరు.
"నరసరావుపేట లో దారుణం..
శృంగేరీ శంకర మఠం సమీపంలో ఉన్న సరస్వతీ విగ్రహంని దారుణంగా ధ్వంసం..
విగ్రహంపై మద్యం పోసి బాటిళ్లతో కొట్టారు..
ఎందుకింత కక్ష..ఏంటీ పైశాచికత్వం?!.." అంటూ కొందరు పోస్టులు పెట్టారు. ధ్వంసమైన సరస్వతి విగ్రహానికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. గుంటూరు జిల్లాలోని నరసరావు పేటలో ఉన్న శృంగేరీ శంకర మఠానికి సంబంధించిన విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారని సామాజిక మాధ్యమాల్లో షేర్లు చేస్తూ ఉన్నారు.
కొన్ని వెబ్ సైట్లలో కూడా ఈ ఘటన గురించి రాసుకుని వచ్చారు.
నిజ నిర్ధారణ:
ఈ వైరల్ పోస్టుల్లో ఎటువంటి 'నిజం లేదు'.
ఈ ఘటనకు సంబంధించిన కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా.. ఆ విగ్రహం ఉన్న భూమి ఓనర్ విజయ్ కుమార్ స్పందించారు. ఆయన ఈ ప్రాంతాన్ని ఓ ప్రైవేట్ కాలేజీ కోసం లీజుకు ఇచ్చారట.. రెండేళ్ల కిందట ఆ ప్రైవేట్ కాలేజీని తీసివేశారు. ఆ సమయంలోనే ఆ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. సరస్వతి విగ్రహాన్ని ధ్వంసం చేసి రెండు సంవత్సరాలకు పైనే అయ్యిందని చెప్పుకొచ్చారు విజయ్ కుమార్.
గుంటూరు జిల్లా డిఎస్పీ కూడా ఈ వైరల్ అవుతున్న పోస్టులపై స్పందించారు. ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసి కొన్ని సంవత్సరాలైందని పోలీసుల విచారణలో తెలిసింది. కృష్ణవేణి కాలేజీ ప్రిన్సిపాల్, లెక్చరర్లను సంప్రదించగా సరస్వతి విగ్రహాన్ని ధ్వంసం చేసి కొన్ని సంవత్సరాలైందని స్పష్టం చేశారు. ఇప్పటి ఘటనలకు ఈ విగ్రహం ధ్వంసానికి ఎటువంటి సంబంధం లేదని తేల్చారు.
�
గుంటూరు పోలీసులు కూడా ఈ విగ్రహం ధ్వంసం గురించి సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదని తేల్చారు. తప్పుడు సమాచారాన్ని సామాజిక మధ్యమాల్లో పోస్టు చేస్తున్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని పత్రికా ప్రకటనలో చెప్పుకొచ్చారు.
కొందరు కావాలనే ఈ విగ్రహ ధ్వంసం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. గొడవలకు దారి తీసేలా కొందరి చర్యలు ఉన్నాయని అన్నారు. పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తున్న ఇద్దరిని అదుపు లోకి తీసుకున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, మతాల మధ్య గొడవలు సృష్టించే విధంగా పోస్టులు పెట్టారని వారిని అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, మతాల మధ్య గొడవలు సృష్టించే విధంగా పోస్టులు చేస్తున్న వారిని అరెస్టు చేస్తామని అన్నారు. ఇలాంటి వదంతులను అసలు నమ్మకండి అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టుల్లో 'ఎటువంటి నిజం లేదు'.