అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రకాశం జిల్లాలో దాదాపు 27వేల మంది కరోనా అనుమానితుల నుంచి సేకరించిన నమూనాలు వృథా అయ్యాయి. జిల్లాలో ఇటీవల అనుమానితుల నుంచి సేకరించిన నమూనాలను సిబ్బంది సరైన విధంగా భద్రపరచకపోవడంతో నష్టం వాటిల్లింది. సాంపిల్స్‌ తీసిన సిబ్బంది వాటికి సరిగా మూతలు పెట్టకపోవడం.. శాంపిల్స్‌పై నంబర్‌ వేయకపోవడం వల్ల 27వేల నమూనాలు తీసి కూడా ఫలితం లేకుండా పోయింది. ఏ శాంపిల్‌ ఎవరిదో తెలియకపోవడంతో వాటిన్నింటిని పక్కన పెట్టేశారు.

కాగా.. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆగ్రహాం వ్యక్తం చేశారు. సేకరించిన నమూనాలకు ఐడీ నంబర్లు వేసి, సీల్ చేయడంలో అధికారులు పొరపాట్లు చేశారని, కనీసం మూత కూడా పెట్టకుండానే ల్యాబ్ లకు పంపుతున్నారని మండిపడ్డారు. దీంతో టెస్టింగ్ కేంద్రాల్లో నమూనాలన్నీ పక్కన పడేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వైద్య, ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ల్యాబ్‌ సిబ్బంది ఒకరు మరణించారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఒంగోలు, పొదిలిలలో అధికారులతో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఉపేక్షింబోమని హెచ్చరించారు. సేకరించిన ప్రతి నమూనానూ నిర్ణీత వ్యవధిలోనే ల్యాబ్ లకు చేర్చాలని, ఒక్కో టెస్ట్ కు ప్రభుత్వం రూ. 1,100 వరకూ ఖర్చు చేస్తున్నదని గుర్తు చేశారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *