గర్ల్ ఫ్రెండ్ కావాలని ఎమ్మెల్యేకు యువకుడి లేఖ
Young man's letter to MLA asking for girlfriend.తమ ప్రాంతంలోని సమస్యలను చెప్పుకుంటూ.. వాటిని పరిష్కరించాలని
By తోట వంశీ కుమార్
తమ ప్రాంతంలోని సమస్యలను చెప్పుకుంటూ.. వాటిని పరిష్కరించాలని కోరుతూ ప్రజలు ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తుండడాన్ని మనం చూస్తూనే ఉంటాం. అయితే.. ఓ యువకుడు ఓ ఎమ్మెల్యేకు రాసిన ఓ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనకు అమ్మాయిలు పడడం లేదని, తనకు ఓ గర్ల్‌ఫ్రెండ్ కావాలని అందులో అతడు కోరాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని జరిగింది.
చంద్రపూర్ ఎమ్మెల్యే సుభాష్ థోతెకు భూషణ్ జామువంత్ అనే యువకుడు ఓ లేఖ రాశాడు. అందులో విచిత్రమైన కోరిక కోరాడు. ఆ లేఖలో ఏం ఉందంటే.. తాను నివసించే ప్రాంతంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారని, ఎవ్వరు కూడా తనను ఇష్టపడడం లేదన్నాడు. తనకు ఆందోళన పెరిగిపోతుందని, ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశాడు. మందుబాబులకు, అల్లరిచిల్లరగా తిరిగే వారికి కూడా గర్ల్‌ఫ్రెండ్స్ ఉంటున్నారని, వారిని చూసినప్పుడు తన గుండె తరుక్కుపోతుందని.. తనకు గర్ల్‌ఫ్రెండ్ కావాలని కోరుతూ.. మరాఠీ భాషలో ఉత్తరం రాశాడు.
ఇక ఈ ఉత్తరాన్ని చూసిన ఎమ్మెల్యే దీనిపై స్పందించారు. గతంలో తనకు ఇలాంటి లేఖలు ఎప్పుడూ రాలేదన్నారు. ఈ లేఖ రాసిన భూషణ్ జామువంత్ ఎక్కడుంటాడో తనకు తెలియదన్నారు. అతడి ఆచూకి కనుగొనే బాధ్యతను కార్యకర్తలకు అప్పగించినట్లు వెల్లడించారు. అతడి ఆచూకీ లభించిన తరువాత అతడికి కౌన్సెల్సింగ్ ఇప్పిస్తానని సదరు ఎమ్మెల్యే తెలిపారు. కాగా.. ప్రస్తుతం ఆ యువడకు రాసిన లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.