ముఖంపై మాస్క్ మాదిరి పెయింట్.. పాస్‌పోర్ట్ సీజ్ చేసిన అధికారులు
Woman paints mask on face.తమ ముఖాలకు సర్జికల్ మాస్క్ మాదిరిగా కనిపించేలా నీలి రంగులో ఫేస్ పెయింట్ వేసుకున్నారు.
By తోట వంశీ కుమార్ Published on 27 April 2021 8:02 AM ISTకరోనాను మాస్క్ తప్ప అరికట్టే ఆయుధం మరొకటి లేదని ప్రపంచం అంతా అంగీకరిస్తున్న విషయం తెలిసిందే. అందుకే అన్ని దేశాలూ మాస్క్ ను తప్పనిసరి చేసాయి. అయితే ఇండోనేషియాలో నివసించే ఇద్దరు యువతులు మాత్రం కొత్తగా.. కాదు కాదు చెత్తగా ఆలోచించారు. బాలీలో ఉంటున్న జోష్ పాలర్ లిన్, లీయా అనే ఇద్దరు అమ్మాయిలు, మాస్క్ కు బదులుగా, తమ ముఖాలకు సర్జికల్ మాస్క్ మాదిరిగా కనిపించేలా నీలి రంగులో ఫేస్ పెయింట్ వేసుకున్నారు. ప్రాంక్ వీడియో కంటెంట్ కోసం కనిపించే స్థానిక సూపర్‌మార్కెట్‌ను సందర్శించారు.
దీన్ని చూసిన వారు అది మాస్క్ కాదని, పెయింటింగ్ అని గుర్తించి ఫిర్యాదు చేశారు. అంతే కాదు ఆ ప్రాంక్ వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. జోష్ పాలర్ లిన్ కు 3,21,000 మంది ఫాలోవర్లు, యూట్యూబ్‌లో 3.4 మిలియన్ల మంది చందాదారులు ఉన్నారు, ఆమె యొక్క వీడియోలలో ఈమధ్యే కనిపించటం మొదలు పెట్టిన లియా కు ఇన్‌స్టాగ్రామ్‌లో 19,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫాలోవర్లు కోసమే వీరు ఈ వీడియో చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇండోనేషియా అధికారులు ఈ వీడియోను చాలా సీరియస్ గా తీసుకున్నారు.
మాస్క్ లేని కారణంగా తమను షాపులోకి రానివ్వలేదనీ అందుకే ఈ విధంగా చేశామని యువతులు చెబుతున్నప్పటికీ, మాస్క్ కొనుక్కొని పెట్టుకోవడం కాకుండా ఇలా పిచ్చి వీడియోలు చేయడం సరికాదని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మాస్క్ పెయింటింగ్తో షాప్ చుట్టూ రెండు సార్లు తిరగడం, చూశారా మమ్మల్ని ఎవరూ పోల్చుకోలేదు అని చెప్పడం వీడియో లో రికార్డు అయిందని, ఇదంతా కావాలని చేసినట్టుగా తెలుస్తోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైతేనేం ఇండోనేషియాలో బహిరంగ ప్రదేశాలలో మాస్కులు లేకుండా తిరగడం నేరం కాబట్టీ వారిని అదుపులోకి తీసుకున్న అధికారులు, వారిద్దరి పాస్ పోర్టులను సీజ్ చేశారు.