మద్యం లారీ బోల్తా.. మందుబాబులకు పండగ.. దొరికినోడికి దొరికినంత

Vehicle carrying liquor worth Rs 10 lakh topples on Madurai highway.కాలంతో సంబంధం లేకుండా జ‌నంతో కిట‌కిట‌లాడే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 May 2022 1:31 PM IST
మద్యం లారీ బోల్తా.. మందుబాబులకు పండగ.. దొరికినోడికి దొరికినంత

కాలంతో సంబంధం లేకుండా జ‌నంతో కిట‌కిట‌లాడే దుకాణం ఏదైనా ఉందా..? అంటే అది మ‌ద్యం దుకాణం మాత్ర‌మే. రేట్లు ఎంత పెరిగినా కానీ.. మ‌ద్యం కొనుగోలుకు వెన‌క్కి త‌గ్గేదే లే అని అంటుంటారు మందుబాబులు. అలాంటిది మ‌ద్యం ఫ్రీ గా వ‌స్తుంది అంటే వ‌దిలిపెడ‌తారా..? మద్యం స్టాకుతో వెళ్తున్న లారీ బోల్తాపడడంతో, కిందపడిన బాటిళ్లు ఎత్తుకెళ్లేందుకు మద్యం ప్రియులు పోటీపడ్డారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. మ‌ధురై జిల్లా విరంగ‌నూర్ జాతీయ ర‌హ‌దారిపై మ‌ద్యం లోడుతో వెలుతున్న లారీ బుధ‌వారం మ‌ధ్యాహ్నం బోల్తా ప‌డింది. అందులో ఉన్న లిక్క‌ర్ బాటిళ్ల మొత్తం రోడ్డుపై చెల్లాచెదురుగా ప‌డిపోయాయి. లారీ బోల్తా ప‌డ‌డం చూసిన అటుగా వెలుతున్న వాహ‌న‌దారులు వెంట‌నే త‌మ వాహ‌నాలను రోడ్డు ప‌క్క‌గా ఆపారు. లారీ డ్రైవ‌ర్‌, క్లీన‌ర్‌కు ఏమైనా దెబ్బ‌లు త‌గిలాయా అన్న‌ది ప‌ట్టించుకోకుండా అందిన కాడికి బాటిళ్ల‌ను ఎత్తుకెళ్లారు. కొంద‌రైతే ఏకంగా రెండు, మూడు బాక్స్‌ల‌ను నెత్తిన పెట్టుకుని పోయారు.

మనలూరు మద్యం గోడౌన్ నుంచి త‌మిళ‌నాడుకు రూ.10 ల‌క్ష‌ల విలువైన మ‌ద్యం బాటిళ్ల‌ను లారీలో త‌ర‌లిస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. అతి వేగం కార‌ణంగానే ఈ ప్రమాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. కాగా.. మ‌ద్యం బాటిళ్ల‌ను ఎత్తుకుపోతున్న ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనిపై నెటీజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. అదృష్టం అంటే మీదే అని ఒక‌రు కామెంట్ చేయ‌గా.. జీవితంలో మ‌ళ్లీ ఇలాంటి అరుదైన ఆఫ‌ర్ దొర‌క‌దు అంటూ మ‌రొక‌రు కామెంట్ పెట్టారు.

Next Story