పెళ్లిలో చిచ్చుపెట్టిన పూలదండ.. తరువాత ఏం జరిగిందంటే
UP Bride Refuses to Marry Groom After he Throws Garland During Varmala Ceremony.వినడానికి కాస్త విచిత్రంగా
By తోట వంశీ కుమార్ Published on 29 Jan 2022 3:57 PM IST
వినడానికి కాస్త విచిత్రంగా ఉన్న ఓ పూల దండ కారణంగా ఓ వివాహం ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఔరయా జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఔరయా జిల్లాలోని బిదునా కొత్వాలికి చెందిన నవీన్ బస్తీలో ఘనంగా వివాహా వేడుక జరుగుతోంది. వధూవరులు ఇద్దరూ పూల దండులు మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. వరుడు ఆకాష్ పూలదండను వధువు మెడలో విసిరేసినట్లుగా వేశాడు. అంతే.. తన మనోభావం దెబ్బతిందని వధువు అలిగింది.
దండను విసిరివేయడం తనకు నచ్చలేదని.. తాను ఈ పెళ్లి చేసుకునేది లేదని బీష్మించుకుని కూర్చుంది. పెళ్లి పెద్దలు, అక్కడ ఉన్న ఎవరూ నచ్చజెప్పినా కూడా ఆమె వినలేదు. పెళ్లి చేసుకోవడానికి ససేమీరా అనడంతో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పెళ్లికి వచ్చిన అతిథుల మధ్యే ఈ రచ్చ అంతా జరిగింది. చివరకు పోలీసులు సైతం రంగప్రవేశం చేసి ఇరువర్గాలను సముదాయించారు. ఇచ్చిపుచ్చుకున్న కానుకలు తిరిగి ఇవ్వడంతో ఇరుకుటుంబాలు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. కాగా.. తాను వధువు మెడలో పద్దతిగానే దండ వేశానని వరుడు వివరణ ఇచ్చినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
కారణం ఏదైనా కలిసి నూరేళ్ళు కలిసి కాపురం చేస్తారని అనుకున్న వధూవరులు ఇలా పీటల మీదే విడిపోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల కాలంలో ఇలా పెళ్లి పీటల మీద ఆగుతున్న వివాహాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.