పెళ్లి మండపం అంతా బంధువులతో నిండిపోయింది. మరికాసేపట్లో వధువు మెడలో వరుడు మూడు ముళ్లు వేయనున్నాడు. అందరూ ఆనందంగా ఉన్నారు. కానీ.. అంతలో వధువు తనకి ఈ పెళ్లి ఇష్టం లేదంటూ పెళ్లి పీఠల మీద నుంచి లేచింది. కాసేపు ఎవ్వరికీ ఏమీ అర్థం కాలేదు. పెద్దలు ఎంత నచ్చజెప్పినప్పటికి వధువు ససేమీరా అనడంతో పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబా జిల్లాలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. మహోబా జిల్లాలోని ధవార్ గ్రామానికి చెందిన రంజిత్ అహిర్వార్ కి బల్లయాన్ గ్రామానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. ఇరు కుటుంబాలు పెళ్లికి ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో దండలు మార్చుకుంటారు అనుకుంటుండగా.. వరుడి ప్రవర్తన పై అనుమానం వచ్చిన పెళ్లి కుమారై.. అతడిని రెండో ఎక్కం చెప్పాలని అడిగింది. పెళ్లి కుమారుడు తడబడ్డారు. దీంతో కనీసం ఎక్కాలు కూడా చెప్పలేని వ్యక్తిని తాను పెళ్లి చేసుకోనని పెళ్లి కుమారై తెగేసి చెప్పింది. బంధువులు యువతికి ఎంత సర్ది చెప్పినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది. ఎంతో చదువుకున్న తాను.. ఎక్కాలు కూడా రాని వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి మండపం నుంచి బయటకు వచ్చేసింది.
పెళ్లి రద్దయ్యాక వివాహ ఏర్పాటుకు అయిన ఖర్చును వరుడి కుటుంబమే చెల్లించాలని వధువు కుటుంబం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం గమనార్హం. ఈ విషయంపై స్టేషన్ హౌస్ ఆఫీసర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ.. 'గ్రామ పెద్దల జోక్యంతో ఇరు కుటుంబాలు రాజీపడ్డాయి. దాంతో మేం ఎటువంటి కేసు నమోదు చేయలేదు. పెద్దల ఒప్పందం ప్రకారం వధూవరుల కుటుంబాలు బహుమతులు మరియు ఆభరణాలను తిరిగి ఇవ్వడానికి అంగీకరించారు' అని ఆయన తెలిపారు.